
శ్రీలంకతో ఫైనల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సంచలన శతకంతో మెరిసింది. కేవలం 92 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తన కెరీర్‌లో పదకొండవ వన్డే సెంచరీ నమోదు చేసింది.
శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్య
తద్వారా మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. కాగా శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు లంక ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 27న శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్‌తో మొదలైన ఈ సిరీస్‌లో .. హర్మన్ సేన వరుస విజయాలు సాధించింది.
తొలుత ఆతిథ్య లంకను, తర్వాత సౌతాఫ్రికాను ఓడించింది. మరుసటి మ్యాచ్లో లంక చేతిలో ఓడిన భారత జట్టు.. తర్వాత సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. మరోవైపు రెండు విజయాలతో శ్రీలంక కూడా తుదిపోరుకు అర్హత సాధించింది.
101 బంతులు ఎదుర్కొని
ఈ క్రమంలో ఇరుజట్ల (IND vs SL) మధ్య కొలంబో వేదికగా ఆదివారం (మే 11) ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. లంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (30), స్మృతి మంధాన శుభారంభం అందించారు. ప్రతికా కాసేపటికే పెవిలియన్ చేరినా.. స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.
మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్‌లో వరుసగా నాలుగు బౌండరీలు బాది సెంచరీ మార్కును అందుకుని.. చక్కటి షాట్లతో అలరించింది.
సరికొత్త చరిత్ర
ఈ క్రమంలో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అవతరించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52 సిక్సర్లు) వెనక్కి నెట్టి.. మొత్తంగా 54 సిక్సర్లతో ఈ ఫీట్ నమోదు చేసింది.
అదే విధంగా.. మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా- 15), సుజీ బేట్స్ (న్యూజిలాండ్- 13) తర్వాతి స్థానాల్లో నిలిచింది. ఇక మొత్తంగా ఇప్పటికి 102 వన్డేలు పూర్తి చేసుకున్న స్మృతి మంధాన ఖాతాలో 4473 పరుగులు ఉన్నాయి.
ఫైనల్ క్వీన్
సిరీస్ ఏదైనా ఫైనల్ అంటే ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఒకింత ఎక్కువవుతుంది. అయితే, మంధాన మాత్రం ఒత్తిడిలోనే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. గత ఐదు ఫైనల్స్‌లో ఆమె ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఒక్కసారి డకౌట్ కావడం మినహా మిగతా నాలుగు సందర్బాల్లో స్మృతి నమోదు చేసిన గణాంకాలు 51 నాటౌట్, 46, 60, 116.
ఇక ఏదేని ఫైనల్లో ఇంత వరకు సెంచరీ బాదిన భారత ఏకైక మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్న మాజీ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి.. తాజాగా సమం చేసింది.
భారత్ తరఫున గత ఐదు ఫైనల్స్‌లో స్మృతి మంధాన గణాంకాలు
👉శ్రీలంక మీద- ట్రై సిరీస్ ఫైనల్లో 101 బంతుల్లో 116, మే, 2025
👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 47 బంతుల్లో 60, జూలై 2024
👉శ్రీలంక మీద- ఆసియా క్రీడల ఫైనల్లో 45 బంతుల్లో 46, సెప్టెంబరు 2023
👉సౌతాఫ్రికాతో- ట్రై సిరీస్ ఫైనల్లో 0, ఫిబ్రవరి 2023
👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 25 బంతుల్లో 51, అక్టోబరు 2022.
ఇక తాజాగా శ్రీలంక- సౌతాఫ్రికాలతో త్రైపాక్షిక సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో కలిపి స్మృతి మంధాన 264 పరుగులు సాధించింది. లంకతో ఫైనల్లో డెమీ విహంగ బౌలింగ్‌లో హర్షిత మాదవికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.
చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!