టైటిల్‌కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..! | Sakshi
Sakshi News home page

టైటిల్‌కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!

Published Sat, May 25 2024 9:05 AM

Yuki Bambry, Albano Olivetti Reached The Final Of Tennis Open Park ATP-250 Tournament

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో మూడో ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న ఓపెన్‌ పార్క్‌ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్‌లాండ్‌)–హెన్రీ ప్యాటెన్‌ (బ్రిటన్‌)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్‌ ఓపెన్‌లో, గత ఏడాది లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచాడు.

సచిన్‌ శుభారంభం 
బ్యాంకాక్‌: ఒలింపిక్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్‌ సచిన్‌ సివాచ్‌ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్‌ బౌట్‌లో సచిన్‌ 5–0తో అలెక్స్‌ ముకుకా (న్యూజిలాండ్‌)పై గెలుపొందాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్‌. ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరుకున్న బాక్సర్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. భారత్‌ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు.   
భారత్‌ పరాజయం 
అంట్‌వెర్ప్‌ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్‌ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలోనూ విఫలమైంది. భారత్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అభిషేక్‌ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్‌లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్‌ అలెగ్జాండర్‌ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా, ఫెలిక్స్‌ (22వ ని.), చార్లియెర్‌ సెడ్రిక్‌ (49వ ని.) చెరో గోల్‌ చేశారు. నేడు భారత్‌ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది.  
 

మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీ
యెచోన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్‌డ్‌ టీమ్‌ కేటగిరీలో ప్రియాంశ్‌తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్‌ నేడు జరుగుతాయి. 

శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీఫైనల్లో  జ్యోతి సురేఖ–ప్రియాంశ్‌ (భారత్‌) ద్వయం  158–157తో హాన్‌ సెంగ్యోన్‌–యాంగ్‌ జేవన్‌ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్‌–సాయెర్‌ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్‌ తలపడతారు. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్‌ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్‌ బెరా గొకిర్‌ (టరీ్క)పై గెలిచింది.     

ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌: కమిన్స్‌

Advertisement
 
Advertisement
 
Advertisement