Mitchell Starc: ఐపీఎల్‌లో వచ్చే డబ్బు కంటే ఆస్ట్రేలియాకు 100 టెస్ట్‌లు ఆడటమే ముఖ్యం..! 

WTC Final: Why Starc Choose To Skip IPL For Test Cricket Revealed - Sakshi

WTC Final: ఐపీఎల్‌లో ఆడకపోవడంపై ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ తొలిసారి స్పందించాడు. ఐపీఎల్‌ కంటే ఆస్ట్రేలియాకు ఆడటమే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఐపీఎల్‌లో లభించే డబ్బు కంటే, దేశానికి 100 టెస్ట్‌లు ఆడటమే తనకు ఇష్టమని తెలిపాడు. ఇందుకోసమే తాను ఐపీఎల్‌ ఆడనని స్పష్టం చేశాడు. డబ్బంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనని, దేశానికి ఆడటానికే తన మొదటి ప్రాధాన్యత అని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటున్నానని అన్నాడు. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌తో స్టార్క్‌ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లు ఆడుతూ తన జట్టుతో 10 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్నానని, ఓ ఫాస్ట్‌ బౌలర్‌కు ఇది అంత సులువు కాదని, ఇతర  లీగ్‌లు ఆడకపోవడం వల్లనే ఇది సాధ్యపడిందని తెలిపాడు. ఆసీస్‌ తరఫున సత్తా చాటే మరో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ వచ్చిన రోజు తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుం‍చి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. 

కాగా, 33 ఏళ్ల స్టార్క్‌ ఐపీఎల్‌లో కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాడు. ఈ రెండు సీజన్లు అతను ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్‌ 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సూపర్‌ ఫామ్‌లో ఉన్నా, ఏదో ఒక సాకు చెబుతూ ఐపీఎల్‌ను స్కిప్‌ చేస్తూ వచ్చాడు.

ఆస్ట్రేలియా తరఫున 77 టెస్ట్‌లు,110 వన్డేలు, 5 టీ20లు ఆడిన స్టార్క్‌.. మొత్తంగా 598 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ గెలిచిన 2015 వన్డే వరల్డ్‌కప్‌, 2021 టీ20 వరల్డ్‌కప్‌ జట్లలో సభ్యుడిగా ఉన్న స్టార్క్‌.. రేపటి నుంచి ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ గెలిచి మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  

ఇదిలా ఉంటే, ఓవల్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్‌ 7 నుంచి 11 వరకు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే. 

చదవండి: WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top