
WTC Final: అటు ఇంగ్లండ్.. ఇటు ఆస్ట్రేలియా.. టీమిండియాకు అంత ఈజీ కాదు!
World Test Championship 2021-23: మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రన్నరప్‌గా నిలిచింది టీమిండియా. మాజీ సారథి విరాట్ కోహ్లి నేతృత్వంలో అద్బుత విజయాలు అందుకుని ఫైనల్ వరకు చేరుకున్న భారత్.. తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి టైటిల్‌ను చేజార్చుకుంది. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ 2021-23లో ఈ తరహా పోటీ ఇవ్వాలంటే ఈ సీజన్‌లో మిగిలి ఉన్న ఏడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరచడంతో పాటుగా మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.
ఇప్పటి వరకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లతో జరిగిన సిరీస్‌లలో ఆరు విజయాలు, 2 డ్రా చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక 2021-23 షెడ్యూల్‌లో భాగంగా ఆడాల్సినవి ఇంగ్లండ్‌లో ఒక టెస్టు, బంగ్లాదేశ్‌లో రెండు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సీజన్‌లో ఆడనున్న ఏడింటిలో కచ్చితంగా ఐదింటిలో రోహిత్ సేన తీవ్ర కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు టెస్టులు. ఈ ఐదు మ్యాచ్‌లలో టీమిండియాకు సవాళ్లు ఎదురవడం ఖాయం. ఆస్ట్రేలియా బలమైన జట్టు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడటం వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఉపఖండ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవడానికి టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్ పర్యటన వారికి మేలు చేస్తుంది. వాళ్లకు నాథన్ లియాన్, స్వెప్సన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్ మినహా మిగతావన్నీ ఉపఖండంలోనే ఆడటం మనకు కలిసి వచ్చే అంశం’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి ఫలితాలు రాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలని ఆకాంక్షించారు.
కాగా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండింటిని డ్రా చేసుకుంది. ఇక ఇంగ్లండ్ అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ స్వదేశంలో జరిగే మ్యాచ్‌లో టీమిండియాకు సవాల్ విసిరే అవకాశం ఉంది.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి..
CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W
— BCCI (@BCCI) March 14, 2022