
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం కంటే ముందే ఏడు క్రీడాంశాల్లో పోటీలు షురూ
1900 ఒలింపిక్స్ తర్వాత పునరాగమనం చేయనున్న క్రికెట్
2028 విశ్వ క్రీడల షెడ్యూల్ విడుదల చేసిన నిర్వాహకులు
జూలై 14 నుంచి 30 వరకు విశ్వక్రీడలు
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్‌ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్ ఈవెంట్స్ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్‌లోని కొన్ని విశేషాలు...
» 2028 జూలై 14న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్ ఏంజెలిస్‌లోని విఖ్యాత ఎల్‌ఏ మెమోరియల్ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్‌ఏ మెమోరియల్ కొలోజియం వేదికగా నిలుస్తుంది.
» బాస్కెట్‌బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్‌బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్‌బాల్, వాటర్ పోలో వంటి ఈవెంట్‌లలో పోటీలు ముందే మొదలవనున్నాయి.
» 1920 ఒలింపిక్స్ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ, హ్యాండ్‌బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్‌బాల్ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు.
» ప్రధాన క్రీడా వేదిక లాస్ ఏంజెలిస్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
» టి20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్‌లో చివరిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు.
» అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రాస్, స్క్వాష్ వంటి పలు క్రీడాంశాలను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది.
» ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్‌లో తొలి మెడల్ ఈవెంట్ జరగనుంది.
» ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్ ఈవెంట్‌లు జరపనున్నారు.
» 2028 జూలై 30న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి.