Nicholas Pooran: పూరన్‌ సిక్సర్ల వర్షం; అయినా గెలిపించలేకపోయాడు

WI Vs PAK: Nicholas Pooran Hitting Doesnt Help West Indies To Won Match - Sakshi

గయానా: పాకిస్తాన్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ పోరాడి ఓడిపోయింది. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ (33 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. కేవలం 7 పరుగుల తేడాతో విండీస్‌ పరాజయం పాలవ్వగా.. పాకిస్తాన్‌ 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బాబర్‌ అజమ్‌ 51 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. ఓపెనర్‌ రిజ్వాన్‌ 6 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. విండీస్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌ , బ్రావో 2 వికెట్లు తీశాడు.

ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే ఫ్లెచర్‌ రూపంలో షాక్‌ తగిలింది. మహ్మద్‌ హఫీజ్‌ బౌలింగ్‌లో ఫ్లెచర్‌ డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఎవిన్‌ లూయిస్‌ 35 పరుగులతో రిటైర్డ్‌హర్డ్‌గా వెనుదిరగ్గా.. క్రిస్‌ గేల్‌ 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్‌ పూరన్‌ దాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. కానీ నికోలస్‌ మాత్రం ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒంటరిపోరాటం చేశాడు. ఇక  ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా..  13 పరుగులు చేసిన కెప్టెన్‌ పొలార్డ్‌ రెండో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత పూరన్‌ మూడు, నాలుగు బంతులకు పరుగులు తీయలేదు. ఐదో బంతిని ఫోర్‌గా మలిచిన పూరన్‌ ఆఖరి బంతిని సిక్స్‌ బాదినా విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 నేడు జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top