ఓ పక్క స్టార్క్‌ మహోగ్రం.. మరో పక్క బోలాండ్‌ విశ్వరూపం | WI Vs AUS 3rd Test: Scott Boland Becomes 10th Australian With A Test Hat Trick, Check Out Match Highlights And Score Details | Sakshi
Sakshi News home page

ఓ పక్క స్టార్క్‌ మహోగ్రం.. మరో పక్క బోలాండ్‌ విశ్వరూపం

Jul 15 2025 9:43 AM | Updated on Jul 15 2025 10:16 AM

WI VS AUS 3rd Test: Scott Boland Becomes 10th Australian With A Test Hat Trick

వెస్టిండీస్‌తో జరిగిన జమైకా టెస్ట్‌లో ఆసీస్‌ పేసర్లు చెలరేగిపోయారు. ఓ పక్క మిచెల్‌ స్టార్క్‌ మహోగ్రరూపం (7.3-4-9-6), మరో పక్క స్కాట్‌ బోలాండ్‌ హ్యాట్రిక్‌ ప్రదర్శన ధాటికి విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలి, టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసింది. ఫలితంగా 176 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. స్టార్క్‌తో పాటు స్కాట్‌ బోలాండ్‌ అటాక్‌ చేయడంతో కేవలం 14.3 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది. స్టార్క్‌ 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. బోలాండ్‌ తనవంతుగా హ్యాట్రిక్‌ వికెట్లతో విరుచుకుపడ్డాడు. 

ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో బోలాండ్‌ వరుసగా 1, 2, 3 బంతుల్లో జస్టిన్‌ గ్రీవ్స్‌, షమార్‌ జోసఫ్‌, జోమెల్‌ వార్రికన్‌ను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్‌ తరఫున 10వ హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆటగాడిగా, డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ల్లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు వేసిన బోలాండ్‌ కేవలం 2 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున హ్యాట్రిక్‌ తీసిన బౌలర్లు..
ఫ్రెడ్రిక్‌ స్పోఫోర్త్‌
హగ్‌ ట్రంబల్‌
జిమ్మీ మాథ్యూస్‌
లిండ్సే క్లైన్‌
మెర్వ్‌ హ్యూస్‌
డేమియన్‌ ఫ్లెమింగ్‌
షేన్‌ వార్న్‌
గ్లెన్‌ మెక్‌గ్రాత్‌
పీటర్‌ సిడిల్‌
స్కాట్‌ బోలాండ్‌

చరిత్ర సృష్టించిన బోలాండ్‌
జమైకా టెస్ట్‌లో స్కాట్‌ బోలాండ్‌ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్‌లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బోలాండ్‌ తన నాలుగేళ్ల కెరీర్‌లో 14 టెస్ట్‌ల్లో 16.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఈ ఆల్‌టైమ్‌ రికార్డు ఇంగ్లండ్‌కు ఆడిన సిడ్నీ బార్న్స్‌ పేరిట ఉంది. బార్న్స్‌ 1901- 1914 మధ్యలో ఇంగ్లండ్‌ తరఫున16.43 సగటుతో వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మిచెల్‌ స్టార్క్‌ విలయతాండవం ధాటికి విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్‌ క్యాంప్‌బెల్‌, కెవియోన్‌ ఆండర్సన్‌, బ్రాండన్‌ కింగ్‌, రోస్టన్‌ ఛేజ్‌, షమార్‌ జోసఫ్‌, జోమెల్‌ వార్రికన్‌, జేడన్‌ సీల్స్‌ ఖాతా కూడా తెరవలేకపోయారు. 

విండీస్‌ ఇన్నింగ్స్‌లో కేవలం​ జస్టిన్‌ గ్రీవ్స్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగాడు. స్టార్క్‌తో పాటు స్కాట్‌ బోలాండ్‌ (2-1-2-3), హాజిల్‌వుడ్‌ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్‌ టెస్ట్‌ క్రికెట్‌లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.

అంతకుముందు ఆసీస్‌ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్‌ (12-2-27-5), షమార్‌ జోసఫ్‌ (13-4-34-4), జస్టిన్‌ గ్రీవ్స్‌ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కెమరూన్‌ గ్రీన్‌ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు.

దీనికి ముందు విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్‌ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్‌ 3, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ తలో 2, స్టార్క్‌, వెబ్‌స్టర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో జాన్‌ క్యాంప్‌బెల్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్‌ (46), స్టీవ్‌ స్మిత్‌ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో షమార్‌ 4, సీల్స్‌, గ్రీవ్స్‌ తలో 3 వికెట్లు తీశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement