
కింగ్‌స్టన్, జమైకా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నామమాత్రపు మూడో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ బీభత్సం సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో విలయతాండవం చేశాడు. స్టార్క్ దెబ్బకు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఈ ఇన్నింగ్స్‌లో స్టార్క్ కేవలం 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్ల ఘనత ఇదే.
🚨 MITCHELL STARC: 7.3-4-9-6 🥶🔥
- WEST INDIES BOWLED OUT FOR JUST 27 RUNS IN THE SECOND INNINGS....!!!! pic.twitter.com/Z3tFsjJalT— Johns. (@CricCrazyJohns) July 15, 2025
ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 7.3 ఓవర్లు వేసిన స్టార్క్ కేవలం 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా వెస్టిండీస్ 204 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే ఘోరంగా కుప్పకూలి 176 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇదే మ్యాచ్‌లో స్టార్క్ మరో ఘనత కూడా సాధించాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని (402) అధిగమించాడు. పింక్ బాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన స్టార్క్.. పింక్ బాల్‌తో తన గణాంకాలను మరింత మెరుగుపర్చుకున్నాడు.
పింక్ బాల్‌తో మొత్తం 14 టెస్ట్‌లు ఆడిన స్టార్క్ 17.08 సగటున ఐదు 5 వికెట్ల ప్రదర్శనలతో 81 వికెట్లు తీశాడు.
ఏడుగురు డకౌట్లు
మిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్‌బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్‌వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్‌లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.
అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.
దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు (ఓ ఇన్నింగ్స్‌లో)..
న్యూజిలాండ్- 26
వెస్టిండీస్- 27
సౌతాఫ్రికా- 30
సౌతాఫ్రికా- 30
సౌతాఫ్రికా- 35