
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.
పాక్‌పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతం
ఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.
అయితే, ఈ మ్యాచ్‌ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్‌తో పాటు ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.
ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీ
ఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్‌తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
ఈసారి కూడా నో షేక్‌హ్యాండ్
ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్‌సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్‌ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రశంసించింది.
అంతా ఒకే కుటుంబం
అదే విధంగా.. ‘‘2022 వరల్డ్‌కప్‌లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.
ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్‌కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.
ఈసారి ఏకపక్ష విజయమే
అయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.
కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది.
ఇదిలా ఉంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.
చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం