కోహ్లి వీరోచితం సరిపోలేదు  | Virat Kohli ton in vain as India lose by 41 runs In 3rd ODI | Sakshi
Sakshi News home page

కోహ్లి వీరోచితం సరిపోలేదు 

Jan 19 2026 6:02 AM | Updated on Jan 19 2026 6:02 AM

Virat Kohli ton in vain as India lose by 41 runs In 3rd ODI

ఆఖరి వన్డేలో 41 పరుగులతో ఓడిన భారత్‌

తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ గెలిచిన న్యూజిలాండ్‌

మిచెల్, ఫిలిప్స్‌ సెంచరీలు 

భారత టాపార్డర్‌ విఫలం 

రాణించిన నితీశ్‌ రెడ్డి, హర్షిత్‌

భారత్‌ ముందున్న లక్ష్యం 338 అసాధారణమైంది. దీన్ని ఛేదించే క్రమంలో 71/4 స్కోరు వద్దే టీమిండియా కుదేలైంది. అప్పటికే రోహిత్‌ శర్మ, గిల్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ అవుట్‌! ఉన్నది కోహ్లి ఒక్కడే! ఈ చేజింగ్‌ కింగ్‌... నితీశ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి 159 స్కోరు వరకు తీసుకెళ్లాడు. జడేజా నిర్లక్ష్యంగా ఆడినా... హర్షిత్‌ రాణాతో ఒడ్డున పడేసేందుకు కడదాకా శ్రమించాడు. 40 బంతుల్లో 61 పరుగుల సమీకరణం గెలుపుపై ధీమాను తెచి్చంది. ఇలాంటి తరుణంలో 277 స్కోరు వద్ద హర్షిత్‌ ని్రష్కమించడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. కోహ్లి వీరోచిత పోరాటానికి అండగా నిలిచేవారే లేకపోవడంతో చివరకు 41 పరుగులతో మ్యాచ్‌ ఓడిన భారత్‌ సిరీస్‌ను 1–2తో చేజార్చుకుంది.  

ఇండోర్‌: ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో దెబ్బ కొట్టిన న్యూజిలాండ్‌... ఈ ఏడాది ఆరంభంలో వన్డేల్లోనూ కంగుతినిపించింది. మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టిన బ్రేస్‌వెల్‌ సారథ్యంలోని కివీస్‌ ఆ తర్వాత వరుస మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. 

టాస్‌ నెగ్గిన టీమిండియా కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా న్యూజిలాండ్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ డరైల్‌ మిచెల్‌ (131 బంతుల్లో 137; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (88 బంతుల్లో 106; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. 

58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను నాలుగో వికెట్‌కు 219 పరుగులు జోడించడం ద్వారా మిచెల్, ఫిలిప్స్‌ భారీస్కోరుకు బాట వేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 46 ఓవర్లలో 296 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. విరాట్‌ కోహ్లి (108 బంతుల్లో 124; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) వన్డేల్లో 54వ శతకం సాధించాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (57 బంతుల్లో 53; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత్‌ రాణా (43 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తదుపరి ఇరు జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ 21న నాగ్‌పూర్‌లో జరగనుంది. 

నిర్ల్యక్షంగా ఆడి...  
పెద్ద లక్ష్యం ముందుంటే బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై  పెద్దగా కష్టపడకుండానే రోహిత్‌ (11), గిల్‌ (23), శ్రేయస్‌ (3), కేఎల్‌ రాహుల్‌ (1) నిర్లక్ష్యంగా అవుటయ్యారు. 13వ ఓవర్‌ ముగియకముందే 71/4 స్కోరు వద్ద భారత్‌ లక్ష్యానికి దూరమైంది. వచ్చిరాగానే సిక్స్‌తో అలరించిన కోహ్లి అడపాదడపా బౌండరీలు బాదాడు. నితీశ్‌ రెడ్డితో కలిసి మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. నితీశ్‌ కొట్టిన ఫోర్‌తో భారత్‌ స్కోరు 20వ ఓవర్లో 100కు చేరింది. తర్వాత కోహ్లి 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్స్‌లు బాదిన నితీశ్‌ కూడా 52 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే నితీశ్‌ను క్లార్క్‌ అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 

కోహ్లి ముందుండి... 
తర్వాత కోహ్లికి జతయిన జడేజా (12) నిరాశపరిచాడు. కానీ హర్షిత్‌ రాణా బ్యాటర్‌ను తలపించే ఆటతీరుతో చక్కని భాగస్వామ్యానికి బాట వేశాడు. 37వ ఓవర్లో భారత్‌ 200 దాటింది. హర్షిత్‌తో పాటు కోహ్లి కూడా షాట్లు ఆడటంతో ఈ దశలో వేగంగా పరుగులు వచ్చాయి. ఈ జోరు సాగుతుండటంతో పోయిన ప్రాణం లేచివచ్చినట్లుగా భారత్‌ గెలుపుపై ఆశలు చిగురించాయి. దీంతోపాటు ‘కింగ్‌’ కోహ్లి 91 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులకు చేరుకుంది. భారీ సిక్స్‌లతో విరుచుకుపడుతున్న హర్షిత్‌ 41 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే అతను అవుటవడంతో 69 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యానికి, భారత్‌ ఆశలకు తెరపడింది. 292 పరుగుల వద్ద కోహ్లి నిష్క్రమించగా, మరో రెండు బంతులకే భారత్‌ ఆలౌటైంది. 

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) రోహిత్‌ (బి) హర్షిత్‌ 5; నికోల్స్‌ (బి) అర్ష్ దీప్‌ 0; యంగ్‌ (సి) జడేజా (బి) హర్షిత్‌ 30; మిచెల్‌ (సి) కుల్‌దీప్‌ (బి) సిరాజ్‌ 137; ఫిలిప్స్‌ (సి) రాహుల్‌ (బి) అర్ష్దీప్‌ 106; బ్రేస్‌వెల్‌ (నాటౌట్‌) 28; మిచెల్‌ హే (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 2; జాక్‌ ఫోక్స్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్దీప్‌ 10; క్లార్క్‌ (బి) హర్షిత్‌ 11; జేమీసన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 337. 
వికెట్ల పతనం: 1–5, 2–5, 3–58, 4–277, 5–283, 6–286, 7–304, 8–327. 
బౌలింగ్‌: అర్ష్దీప్‌ 10–1–63–3, హర్షిత్‌ 10–0–84–3, సిరాజ్‌ 10–0–43–1, నితీశ్‌ 8–0–53–0, కుల్దీప్‌ 6–0–48–1, జడేజా 6–0–41–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) క్లార్క్‌ (బి) ఫోక్స్‌ 11; గిల్‌ (బి) జేమీసన్‌ 23; కోహ్లి (సి) మిచెల్‌ (బి) క్లార్క్‌ 124; అయ్యర్‌ (సి) ఫోక్స్‌ (బి) క్లార్క్‌ 3; రాహుల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) లెనాక్స్‌ 1; నితీశ్‌ (సి) యంగ్‌ (బి) క్లార్క్‌ 53; జడేజా (సి) యంగ్‌ (బి) లెనాక్స్‌ 12; హర్షిత్‌ (సి) నికోల్స్‌ (బి) ఫోక్స్‌ 52; సిరాజ్‌ (సి) హే (బి) ఫోక్స్‌ 0; కుల్దీప్‌ (రనౌట్‌) 5; అర్ష్దీప్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్‌) 296. 
వికెట్ల పతనం: 1–28, 2–45, 3–68, 4–71, 5–159, 6–178, 7–277, 8–277, 9–292, 10–296. 
బౌలింగ్‌: జేమీసన్‌ 9–0–58–1, ఫోక్స్‌ 9–0–77–3, క్లార్క్‌ 9–0–54–3, లెనాక్స్‌ 10–0–42–2, మిచెల్‌ 1–0–10–0, ఫిలిప్స్‌ 8–0–54–0.  

1: భారత్‌లో భారత జట్టుతో న్యూజిలాండ్‌ ఇప్పటి వరకు 8 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడింది. ఏడుసార్లు సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌ ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
1: ఇండోర్‌లోని హోల్కర్‌ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 8 వన్డేలు ఆడింది. ఈ వేదికపై వరుసగా ఏడు వన్డేల్లో నెగ్గిన టీమిండియాకు న్యూజిలాండ్‌ తొలిసారి ఓటమి రుచి చూపించింది. 
6: భారత్‌లో భారత జట్టును ఓడించి వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న ఆరో జట్టు న్యూజిలాండ్‌. గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, 
వెస్టిండీస్, ఇంగ్లండ్‌ ఈ ఘనత సాధించాయి.
9: కోహ్లి సెంచరీ సాధించిన వన్డేలో భారత జట్టు ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement