రవీంద్రకు మేము కనిపించడం లేదు.. నా భార్యనే అంటారా? ఊహించలేదు జడ్డూ.. | Sakshi
Sakshi News home page

పెత్తనమంతా వాళ్లదే.. మర్యాద తప్పొద్దు! ఏంటి జడ్డూ.. నాన్న గురించి ఇలాగేనా?

Published Fri, Feb 9 2024 4:32 PM

Very Pathetic: Fans React To Ravindra Jadeja Reply Over His Father Allegations - Sakshi

#RavindraJadeja-  What went wrong In His Family: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గురించి వస్తున్న వార్తలపై అతడి అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది జడ్డూకు మద్దతుగా నిలిస్తే.. మరికొంత మంది అతడి తండ్రికి అండగా నిలుస్తున్నారు. ఏదేమైనా కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

పెళ్లైన తర్వాత పూర్తిగా మారాడు
కాగా పెళ్లైన తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడని అతడి తండ్రి అనిరుధ్‌సిన్హా జడేజా సంచలన ఆరోపణలు చేశారు. అతడిని క్రికెటర్‌ను చేసి పెద్ద తప్పు చేశానని.. లేదంటే అందరిలాగే తమ కొడుకు కూడా తమ దగ్గరే ఉండేవాడని వాపోయారు. 

కోడలిగా రివాబా తమ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత .. పెత్తమనమంతా ఆమెది, ఆమె తల్లిదండ్రులదేనంటూ అనిరుధ్‌ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్‌ భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రవీంద్ర, అతడి భార్య రివాబాతో మాకు ఇప్పుడు ఎలాంటి బంధుత్వం లేదు.

సొంతబంగ్లాలో ఉంటాడు
వాళ్లు మాతో మాట్లాడరు. మేము కూడా వాళ్లతో మాట్లాడటం లేదు. రవీంద్ర పెళ్లైన తర్వాత రెండు- మూడు నెలల నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నేను జామ్‌నగర్‌లో ఉంటున్నా. రవీంద్ర జడేజా సొంతబంగ్లాలో విడిగా ఉంటున్నాడు. మాతో పాటు ఒకే పట్టణంలో నివసించినా.. నాకు నా కుమారుడిని కలిసే అవకాశం లేదు.

వాడి భార్య ఏం మంత్రం వేసిందో గానీ
వాడి భార్య ఏ మంత్రం వేసిందో తెలియదు కానీ.. మా మధ్య సత్సంబంధాలు లేవు. వాడికి సంబంధించిన కొన్ని ట్రోఫీలు, బట్టలు అన్నీ ఇంకా నా గదిలోనే ఉన్నాయి.  నిజానికి నేను ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. కీర్తి శేషురాలైన నా భార్య పెన్షన్‌తో బతుకున్నాను. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసిన నేను నా కొడుకును క్రికెటర్‌ను చేశాను.

డబ్బు రవీంద్రది.. పెత్తనమంతా వాళ్లదే
తనకు పేరు వచ్చాక, సంపద పెరుగుతున్నక్రమంలో మేము రెస్టారెంట్‌ ప్రారంభించాం. ఆ రెస్టారెంట్‌ వ్యవహారాలు తొలుత నా కుమార్తె నైనాబా చూసుకునేది. అయితే, రవీంద్ర పెళ్లైన కొన్నాళ్ల తర్వాత .. రివాబా యజమానురాలైంది. అలా కుటుంబంలో చిచ్చు రేగింది. అదే మేము విడిపోవడానికి కారణమైంది.

ప్రతి విషయంలోనూ రివాబా తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకుంటారు. వాళ్లు ఇటీవలే రూ. 2 కోట్ల విలువైన ఇంట్లోకి మారారు. అదంతా రవీంద్ర డబ్బే. తను నా కుమారుడు.

ఇదంతా నా మనసును దహించి వేస్తోంది. తనకు పెళ్లి చేయకపోయినా బాగుండేది. లేదంటే అసలు క్రికెటర్‌ కాకపోయినా ఇంకా బాగుండేది. ఇప్పుడిలా తనకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు’’ అని అనిరుద్‌సిన్హా తన కోడలు, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి జడేజాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తండ్రి చేసిన ఆరోపణలపై రవీంద్ర జడేజా స్పందిస్తూ... తన భార్య రివాబా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఇంటర్వ్యూలు ప్లాన్‌ చేశారని మండిపడ్డాడు. తమ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. వాటిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాడు.

దివ్య భాస్కర్‌ చేసిన ఈ ఇంటర్వ్యూ పూర్తిగా స్క్రిప్టెడ్‌ అని, అర్ధరహితమైందని కొట్టిపారేశాడు. నాణేనికి ఒక వైపును మాత్రమే ఎందుకు చూపిస్తారని జడ్డూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను చెప్పాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయని.. అయితే, వాటిని పబ్లిక్‌లో చెబితే బాగుండదని ఘాటుగానే బదులిచ్చాడు.

రివాబా బీజేపీలో.. మామ, ఆడపడుచు కాంగ్రెస్‌లో!
కాగా జడ్డూ సోదరి నైనాబా కారణంగానే రివాబా అతడికి పరిచయమైందని గతంలో వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబాలు సంతోషంగా వీరి పెళ్లి చేశాయి. అయితే, రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరగా.. అప్పటికే మామ అనిరుద్‌సిన్హా, ఆడపడుచు నైనాబా కాంగ్రెస్‌లో ఉన్నారు.

ఈ క్రమంలో రివాబాకు రవీంద్ర జడేజా అండగా నిలవగా.. భర్త ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే టికెట్‌ సంపాదించారు.  జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు రివాబా.

కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఆడపడుచు నైనాబా, మామ అనిరుద్‌ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వారి గురించి రివాబా మాట తూలకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇలాంటి అనిరుద్‌సిన్హా ఈ మేరకు ఆరోపణలు చేయడం, రవీంద్ర జడేజా ఇందుకు ఇలా సోషల్‌ మీడియాలో స్పందించడం నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చింది.

కాగా టెస్టుల్లో నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న జడేజా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. అయితే, తొలి టెస్టులో గాయపడిన అతడు రెండో మ్యాచ్‌కు అందుబాటులోలేకుండా పోయాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement