
వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా ఫ్యూచర్ స్టార్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టీ20 లీగ్ ఐపీఎల్‌లో కేవలం 14 వయస్సులోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్ తొలి బంతినే బౌండరీగా మలిచిన చిచ్చరపిడుగు అతడు.
సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచం చూసిన యువ సంచలనం అతడు. వైభవ్ తన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. సూర్యవంశీ ఇప్పటికే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ మరియు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలలో బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
దీంతో అతడు రాబోయే 2 సంవత్సరాల్లో భారత తరపున అరంగేట్రం చేస్తాడని కొంతమంది మాజీలు జోస్యం చెబుతున్నాడు. తాజాగా వైభవ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాతో రాయుడు పోల్చాడు.
"వైభవ్ సూర్యవంశీకి అసాధారణ బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడి బ్యాట్ స్పీడ్ గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. అతడు బంతిని హిట్ చేసే విధానం నిజంగా అత్యద్భుతం. బ్రియాన్ లారా కూడా ఇలాంటి బ్యాట్ లిఫ్ట్ ఉండేది. లారా లాంటి లెజెండ్‌తో వైభవ్ ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది.
డిఫెన్స్ లేదా షాఫ్ట్ హ్యాండ్స్‌తో ఆడేటప్పుడు బ్యాట్ వేగాన్ని ఎలా నియంత్రించాలో లారా నుంచి వైభవ్ నేర్చుకోవచ్చు. అప్పుడు అతడు బ్యాటింగ్ పరంగా మరింత రాటుదేలుతాడు. వైభవ్ బయట వ్యక్తుల మాటలు అస్సలు వినకూడదు.
కోచ్‌ల గైడెన్స్‌లో తన టాలెంట్‌ను నమ్ముకుంటూ ముందుకు వెళ్లాలి. రాహుల్ ద్రవిడ్ వంటి లెజెండరీ ఆటగాడు కోచ్‌గా ఉండడం వైభవ్ అదృష్టం. ద్రవిడ్ భాయ్ కచ్చితంగా అతడిని మరింత తీర్చుదిద్దుతాడు" అని శుభంకర్ మిశ్రా అన్‌ప్లగ్డ్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.
కాగా రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ 7 మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 వన్డే సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 355 పరుగులు చేశాడు.
చదవండి: ఆసియాకప్ జట్టులో నో ఛాన్స్.. పాకిస్తాన్ కెప్టెన్ కీలక నిర్ణయం