
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఓ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (WTC) 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 12) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో 23 పరుగులు చేసి ఔటైన బాబర్.. 2 పరుగుల వద్ద 3000 పరుగుల మైలురాయిని తాకాడు. గత మూడేళ్లుగా విఫలమవుతున్నా బాబర్ ఈ ఘనత సాధించడం విశేషం. బాబర్ కంటే అన్ని విభాగాల్లో బలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా డబ్ల్యూటీసీలో 3000 పరుగుల మైలురాయిని తాకలేకపోయారు.
ఆసియాలో అత్యధిక డబ్ల్యూటీసీ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాబర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్కు అతి సమీపంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. కోహ్లి, రోహిత్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి, బాబర్ను ఈ విభాగంలో అధిగమించే అవకాశం వారికి లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019లో పరిచయమైన విషయం తెలిసిందే.
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ఆసియా బ్యాటర్లు
బాబర్ ఆజమ్- 3021
శుభ్‌మన్ గిల్- 2826
రిషబ్ పంత్- 2731
రోహిత్ శర్మ- 2716
కరుణరత్నే- 2642
విరాట్ కోహ్లి- 2617
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-8 బ్యాటర్లు
జో రూట్- 6080
స్టీవ్ స్మిత్- 4278
మార్నస్ లబూషేన్- 4225
బెన్ స్టోక్స్- 3616
ట్రవిస్ హెడ్- 3300
ఉస్మాన్ ఖ్వాజా- 3288
జాక్ క్రాలే- 3041
బాబర్ ఆజమ్- 3021
పాకిస్తాన్-సౌతాఫ్రికా మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. లాహోర్లోని గడాఫీ స్టేడియం ఈ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్‌లో ఉన్నారు.
మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు