
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravnidra Jadeja) బ్యాట్‌తో అదరగొట్టాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆసాంతం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కీలక సమయాల్లో తానున్నానంటూ జట్టును ఆదుకున్నాడు.
మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి జడ్డూ 516 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం.. ఐదు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు జడ్డూ ఈ సిరీస్‌లో ఏడు వికెట్లు కూడా పడగొట్టడం గమనార్హం. ఇలా ఇంగ్లండ్‌తో సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేయడంలో తన వంతు పాత్రను జడేజా సమర్థవంతంగా పూర్తి చేశాడు.
అతడు ఓ అండర్‌రేటెడ్ ప్లేయర్
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రవీంద్ర జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ అద్భుతంగా ఆడినా రావాల్సినంత గుర్తింపు దక్కడం లేదని పేర్కొన్నాడు. ‘‘అతడు ఓ అండర్‌రేటెడ్ ప్లేయర్ అనే చెప్తాను.
క్రెడిట్ దక్కడం లేదు
జట్టు కోసం అతడు ఎంతో కష్టపడతాడు. తన వంతుగా పరుగులు రాబడతాడు. వికెట్లు తీస్తాడు. కానీ అతడికి ఎక్కువగా క్రెడిట్ దక్కడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచాడు.
ఈ ఒక్క సిరీస్ అనే కాదు.. గతంలోనూ చాలా సార్లు జట్టుకు అవసరమైన వేళ నేనున్నానంటూ వచ్చి.. ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు’’ అని సచిన్ టెండుల్కర్ జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించాడు.
కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శన
అదే విధంగా.. కేఎల్ రాహుల్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘కేఎల్ రాహుల్ అత్యుత్తమ ప్రదర్శనను మరోసారి ఈ సిరీస్‌లో చూశాను. అతడు చక్కగా డిఫెండ్ చేసుకోవడంతో పాటు.. వీలు చిక్కినప్పుడల్లా తనవైన షాట్లతో అలరించాడు.
ఏ బంతిని ఆడాలో.. దేనిని వదిలేయాలో అతడికి తెలుసు. కొన్నిసార్లు తన ప్లానింగ్‌తో బౌలర్లనే బోల్తా కొట్టించాడు కూడా’’ అని సచిన్ టెండుల్కర్ రాహుల్‌ను కొనియాడాడు.
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడింది. తొలుత లీడ్స్‌లో ఓటమిపాలైన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది. అనంతరం లార్డ్స్ టెస్టులో ఓడిన భారత జట్టు.. మాంచెస్టర్ టెస్టును డ్రా చేసింది.
అయితే, చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరిదైన ఓవల్ టెస్టులో మాత్రం అదరగొట్టింది. ఓటమి ఖాయమనుకున్న వేళ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లోనూ భారత్‌కు ఇదే తొలి సిరీస్ అన్న విషయం తెలిసిందే.
చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే!