
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో ఆంటిగ్వా గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఫాల్కాన్స్ బ్యాటర్లలో ఫాబియన్ అలెన్(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇమాద్ వసీం(39), ఆండ్రూ(22) రాణించారు. స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(7) మరోసారి బ్యాట్‌తో నిరాశపరిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నాథన్ ఎడ్వర్డ్స్, ఉస్మాన్ తారిఖ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..అకిల్ హోస్సేన్, అమీర చెరో వికెట్ పడగొట్టారు.
పొలార్డ్ మెరుపులు వృథా..
అనంతరం లక్ష్య చేధనలో ట్రిబాగో నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది. కిరాన్ పొలార్డ్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
నైట్‌రైడర్స్ బ్యాటర్లలో పొలార్డ్‌తో పాటు కొలిన్ మున్రో(18 బంతుల్లో 44), కార్టీ(35) దాటిగా ఆడారు. అయితే టాపర్డర్ విఫలం కావడంతో నైట్‌రైడర్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కెప్టెన్ నికోలస్ పూరన్(14 బంతుల్లో 10) మరోసారి నిరాశపరిచాడు. ఆంటిగ్వా బౌలర్లలో ఒబద్ మెకాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
చదవండి: ఆసియాకప్ జట్టులో నో ఛాన్స్.. పాకిస్తాన్ కెప్టెన్ కీలక నిర్ణయం