రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్‌పై మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.
చెత్త షాట్ ఆడి..
కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్‌నెస్ ఈ మ్యాచ్‌లోనూ బయటపడింది. 'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అబ్దుల్లా అహ్మద్‌జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్‌ను ఆడి తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్-2026లోనూ చాలా మ్యాచ్‌లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్ పేసర్.. ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బోల్తా కొట్టించాడు.


