ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.
సచిన్ రికార్డు బద్దలు
జూన్‌లో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్‌కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.
అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.
నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్
గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకాల మోత మోగించాడు.
అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
అత్యధిక పరుగుల వీరుడిగా ఘనత
ఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్‌గా పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు.
తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపిక
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం.
ఓవరాల్‌గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!!
చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే


