కోల్‌కతా: సొంతగడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శనతో అగ్రశ్రేణి టీమ్ చేతిలో చిత్తయింది. మంగళవారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఉరుగ్వే 6–1 గోల్స్ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఉరుగ్వే తరఫున డార్విన్ నునెజ్ (12వ ని.), మ్యాక్సీమిలియానో అరాజో (28వ నిమిషం, 59వ నిమిషం), రోడ్రిగో జలాజర్ (53వ నిమిషం), యువాన్ మాన్యూల్ సనాబ్రియా (71వ నిమిషం), రోడ్రిగో ఎగ్వైర్ (86వ నిమిషం) కలిసి ఆరు గోల్స్ నమోదు చేశారు.
భారత్ తరఫున అనిరుధ్ థాపా (22వ నిమిషం) ఏకైక గోల్ సాధించాడు. అనిరుధ్ గోల్‌తో భారత్ 1–1తో సమంగా నిలవడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. అయితే ఆ తర్వాత ఉరుగ్వే ఎదురు లేకుండా దూసుకుపోయింది. రెండో అర్ధభాగంలోనే ఆ జట్టు నాలుగు గోల్స్ కొట్టింది. సాల్ట్‌లేక్ స్టేడియంలో విద్యుత్ సమస్య కారణంగా మ్యాచ్ మధ్యలో 37 నిమిషాల పాటు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌తో భారత్ వరుసగా ఆడిన మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ముగిశాయి.


