అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. నిన్న (జనవరి 16) జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత సౌతాఫ్రికాను 238 పరుగులకే ఆలౌట్ చేసి, 28 పరుగుల తేడాతో గెలుపొందింది.
తొలుత ఖలీద్ అహ్మద్ (74), ఫైసల్ షినోజాదా (81), ఉజైరుల్లా నియాజాయ్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి ఆఫ్ఘనిస్తాన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆతర్వాత అబ్దుల్ అజీజ్, ఖటిర్ స్టానిక్‌జాయ్ తలో 2, నూరిస్తానీ ఒమర్‌జాయ్, హఫీజ్ జద్రాన్ చెరో వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బేశారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఫీలర్డు మైదానంలో పదరసంలా కదిలారు. ఏకంగా నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లను రనౌట్ చేశారు.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. తొలుత బౌలింగ్‌లో బుయండా మజోలా, కోర్నే బోథా తలో 3, జేజే బస్సన్ ఓ వికెట్ తీసి రాణించారు. ఆతర్వాత బ్యాటింగ్‌లో జేసన్ రోల్స్ (98) అద్భుతంగా రాణించినా సౌతాఫ్రికాను గట్టెక్కించలేకపోయాడు. రోల్స్ సెంచరీకి ముందు రనౌట్ కావడంతో సౌతాఫ్రికా పరిస్థితి తారుమారయ్యింది. చివర్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఒత్తిడికి లోనై అనవసరపు రనౌట్లయ్యారు. ఫలితంగా మ్యాచ్‌ను కోల్పోయారు. ఈ గెలుపు క్రెడిట్ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లకే దక్కుతుంది.
కాగా, ప్రపంచకప్‌లో భాగంగా నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా బోణీ కొట్టాయి. ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించాయి. ఇవాళ (జనవరి 17) బంగ్లాదేశ్ భారత్‌తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఇదివరకే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై ఘన విజయం సాధించింది.


