ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో సుదిని నితీశ్ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్‌కప్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నితీశ్ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్ శని (33), అదిత్ (40) ఫర్వాలేదనిపించారు.
అంతా మనోళ్లే
అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), సాహిల్ గార్గ్ (9), అమరిందర్ గిల్ (10), అదిత్ (6), అమోఘ్ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు.
మ్యాచ్ రద్దు
న్యూజిలాండ్ బౌలర్లలో ఫ్లిన్ మోరె 4, మాసన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 1 ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్


