IND Vs PAK: చలో చిరకాల సమరానికి.. నేడు భారత్,పాక్‌ల మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ | ICC ODI WC 2023 IND Vs PAK Today: When And Where To Watch, Pitch Condition, Predicted Playing XI And Other Details - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs PAK Today: చలో చిరకాల సమరానికి.. నేడు భారత్,పాక్‌ల మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

Published Sat, Oct 14 2023 12:30 AM

Today is the World Cup match between India and Pakistan - Sakshi

ప్రపంచకప్‌లో 51 మ్యాచ్‌లు ఉన్నా, అందరూ ఎదురు చూసేది ‘ఈ’ మ్యాచ్‌ కోసమే... ఈ మ్యాచ్‌ కోసమే ప్రసారకర్తలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేస్తారు... ఈ మ్యాచ్‌ కోసమే ఫ్లయిట్‌ టికెట్లు, ప్రకటనల రేట్లు ఆకాశానికి  అంటుతాయి... ఈ మ్యాచ్‌ కోసమే అభిమానులు ఎన్ని కష్టాలకోర్చి అయినా  మైదానంలోకి అడుగు పెట్టాలని ఆశపడతారు... ఈ మ్యాచ్‌ కోసమే ఆస్పత్రి  మంచాలు కూడా హోటల్‌ బెడ్‌లుగా మారిపోతాయి... ఈ మ్యాచ్‌ కోసమే  సినీ తారలతో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది... ఈ మ్యాచ్‌ అంటే బీసీసీఐ, ఐసీసీ దృష్టిలో ‘నవరాత్రి’ సంబరం...

చరిత్ర అంతా ఒక వైపే ఉండవచ్చు... వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్‌నే విజయం వరించి ఉండవచ్చు... ప్రస్తుత  బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూస్తే మరో మాటకు తావు లేకుండా టీమిండియానే ఫేవరెట్‌ అనవచ్చు... అయినా సరే ఈ పోరుకు ఎక్కడ లేని ఆకర్షణ... సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయాల కారణంగా ఇది ఆట మాత్రమే కాకుండా అంతకు మించిన భావోద్వేగ సమరం... ఆటగాళ్లు మాకు అన్ని మ్యాచ్‌లాగే ఇదీ ఒకటి అని పైకి చెప్పవచ్చు కానీ వారికీ తెలుసు... మైదానంలో దిగాక తమ గుండె చప్పుడు ఎలా ఉంటుందో...

దాదాపు ఏడాది క్రితం అక్టోబర్‌ 23, 2022న టి20 ప్రపంచకప్‌లో రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి బాదిన రెండు వరుస సిక్సర్లు గుర్తుకొచ్చాయా... నాడు 90 వేల మంది సామర్థ్యం గల మెల్‌బోర్న్‌ స్టేడియం దద్దరిల్లింది. ఇప్పుడు 1,32,000 మంది ప్రేక్షకులతో నరేంద్ర మోదీ మైదానం మోతెక్కడం ఖాయం. ఈ రెండింటి మధ్య ఆసియా కప్‌లో తలపడినా వరల్డ్‌కప్‌ లెక్క వేరు... మన అభిమానులతో స్టాండ్‌లు ‘నీలి సముద్రం’గా మారబోతుండగా, ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై భారత్‌ను ఎదుర్కొంటూ తమకు మద్దతిచ్చే ఒక్క అభిమానీ లేని పాక్‌ తట్టుకోగలదా అనేది ఆసక్తికరం.  

అహ్మదాబాద్‌: వరల్డ్‌కప్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ, భారీ అంచనాల నడుమ నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే లీగ్‌ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌పై వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో భారత్‌ ఆధిక్యం మరింత పెరుగుతుంది. మరోవైపు ఒక్కసారైనా టీమిండియాను ఓడించి పేలవ గణాంకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని పాక్‌ భావిస్తోంది.

టోర్నీలో తమ తొలి రెండు మ్యాచ్‌లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్‌లపై భారత్‌ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్‌ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
 
గిల్‌ బరిలో దిగుతాడా... 

భారత్‌ తుది జట్టు విషయంలో మామాలుగానైతే ఎలాంటి సమస్య లేదు. కానీ డెంగీ జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్‌లు ఆడని శుబ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగడంపైనే ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం నుంచి కోలుకున్న అతను గురువారం స్వల్ప సమయం పాటు సాధన చేసినా... శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేశాడు. కెపె్టన్‌ రోహిత్‌ ‘గిల్‌ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడు’ అని చెప్పడం అతను ఆడే అవకాశాలను మెరుగుపర్చింది.

ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉండటంతో పాటు ఐపీఎల్‌లో ఇది అతని సొంత మైదానం కావడం కూడా మరో కారణం. అయితే ఆ ఒక్క శాతం పూర్తిగా కోలుకోకపోతేనే సమస్య. గిల్‌ లేకపోతే ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. రోహిత్, కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ల బ్యాటింగ్‌ ఫామ్‌ భారత్‌కు పెద్ద బలం. అఫ్గాన్‌పై సెంచరీతో రోహిత్‌ తన స్థాయిని చూపిస్తే కోహ్లి ప్రశాంతంగా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2015లో కోహ్లి, 2019లో రోహిత్‌ పాక్‌పై సెంచరీలతో చెలరేగారు.

రాహుల్‌ కూడా తన విలువను ప్రదర్శిస్తుండగా, మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు సిద్ధం కాగా, కుల్దీప్, సొంతగడ్డపై ఆడనున్న బుమ్రా బౌలింగ్‌ను పాక్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎనిమిదో స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ను తప్పించి అశ్విన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చు. అయితే రెండు సీజన్లుగా ఈ మైదానంలో ఉత్తమ రికార్డు ఉన్న షమీ కూడా పరిశీలనలో ఉన్నాడు.  

జోరు కొనసాగేనా... 
శ్రీలంక బౌలింగ్‌ బలమైనది కాకపోయినా సరే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యఛేదన అంత సులువు కాదు. కానీ దీనిని సాధించడం కచ్చితంగా పాకిస్తాన్‌ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌తో తడబడిన తీరుతో పోలిస్తే ఆ జట్టు పరిస్థితి మారింది. హైదరాబాద్‌లో ఆడిన తుది జట్టునే పాక్‌ ఇక్కడా కొనసాగించవచ్చు.

రిజ్వాన్‌ ఫామ్‌లో ఉండగా, అబ్దుల్లా షఫీక్‌ రూపంలో దూకుడైన ఓపెనర్‌ వెలుగులోకి రావడం సానుకూలాంశం. మిడిలార్డర్‌లో షకీల్, ఇఫ్తికార్‌ తమ వంతు పాత్ర పోషించగలరు. అయితే ఇమామ్‌ పేలవ ఆటతో పాటు జట్టు నంబర్‌వన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ విఫలం కావడమే టీమ్‌ను ఆందోళన పరుస్తోంది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి బాబర్‌ 71 పరుగులే చేశాడు. అతను తన స్థాయికి తగినట్లుగా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది.

బౌలింగ్‌లో ఇప్పటికీ ప్రధాన అస్త్రం షాహిన్‌ అఫ్రిదినే. తన పదునైన లెఫ్టార్మ్‌ పేస్‌తో ఆరంభ ఓవర్లలో అతను భారత బ్యాటర్లను నిలువరించాలని జట్టు కోరుకుంటోంది. ఆపై రవూఫ్‌ కూడా కీలకం కానున్నాడు. భారీగా పరుగులిచ్చే హసన్‌ అలీ స్థానంలో వసీమ్‌ ఆడే అవకాశం ఉంది. టీమ్‌లో ఒక ప్రధాన స్పిన్నర్‌ లేకపోవడం పాక్‌ జట్టు పెద్ద బలహీనత. షాదాబ్, నవాజ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కోగలరు. 

పిచ్, వాతావరణం 
గత రెండేళ్లలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో 59.8 శాతం వికెట్లు తీసి పేసర్లు ఎక్కువ ప్రభావం చూపించారు. అయితే ఈ మ్యాచ్‌ కోసం నల్లరేగడి మట్టి ఉన్న పిచ్‌ను ఎంచుకున్నారు. అంటే పిచ్‌ నెమ్మదిగా మారిపోయి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ప్రేక్షకుల కోణంలో పరుగుల వరద కోసమే నిర్వాహకులు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. వేడి వాతావరణం, వర్ష సూచన లేదు.  

మూడో స్పిన్నర్‌ను ఆడించే విషయంపై ఇప్పుడే చెప్పలేను. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టులో అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేస్తాం. గత నాలుగేళ్లలో నేనేమీ పెద్దగా మారలేదు. బ్యాటర్‌గా చూస్తే ప్రతీ మ్యాచ్‌కు ముందు నా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. దాని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నద్ధతలో లోటు ఉండదు. ప్రతీ రోజు కొత్త సవాలే.  అన్నింటికీ సిద్ధంగా ఉంటా. నా ఆటేంటో, జట్టుకు నా అవసరం ఏమిటో బాగా తెలుసు. కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌ కోసం సహచరులకు ప్రత్యేక సూచనలేమీ చేయను. వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లలాగే ఇదీ ఒకటి.   –రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌  

సారథిగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఒక్క మ్యాచ్‌ వల్ల నాకు కెప్టెన్సీ రాలేదు. ఈ ఒక్క మ్యాచ్‌ వల్ల అది పోదు. దేవుడు ఎంత ఇస్తే అంతే దక్కుతుంది. భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య గతంలో ఎన్నోసార్లు ఆడాం కాబట్టి ఇదేమీ కొత్త కాదు. పాక్‌ అభిమానులను అనుమతిస్తే బాగుండేది. కానీ మద్దతు లేకపోయినా మేం దీనికి సిద్ధమయ్యే ఉన్నాం. చరిత్ర గురించి నేను పట్టించుకోను. రికార్డులు ఏదో ఒక రోజు బద్దలవుతాయి. 2021 టి20 ప్రపంచకప్‌లో మేం భారత్‌ను ఓడించాం. అంతకుముందు అదీ లేదు కదా. కాబట్టి దేనికైనా ఎక్కడో ఒక చోట ముగింపు తప్పదు. –బాబర్‌ ఆజమ్, పాకిస్తాన్‌ కెప్టెన్‌  


తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌/ఇషాన్‌ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్‌/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్‌. 
పాకిస్తాన్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), షఫీక్, ఇమా మ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్‌ అఫ్రిది, హసన్‌/వసీమ్, రవూఫ్‌. 

Advertisement
Advertisement