
నార్తాంప్టన్ వేదికగా సోమవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఒక్క వికెట్ తేడాతో భారత్ అండర్-19 జట్టు ఓటమి పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. భారత్ నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది.
లక్ష్య చేధనలో ఇంగ్లండ్ యువ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఓ దశలో టీమిండియా సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రెవ్ అద్భుతమైన సెంచరీతో భారత్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.
ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి రెవ్ మాత్రం విరోచిత పోరాటం చేశాడు. 83 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. అతడితో పాటు సెబాస్టియన్ మోర్గాన్నాట్(20), అలెక్స్ గ్రీన్(12) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హెనిల్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు.
వైభవ్ మెరుపులు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు విహాన్ మల్హోత్రా(49), రాహుల్ కుమార్(47), కన్షిక్ చౌహన్(45) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ నాలుగు.. హోమ్, గ్రీన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఇదే వేదికలో జరగనుంది.
చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్