
ఓటమి ఖాయమనుకున్న సిరీస్‌లో టీమిండియా అద్భుతమే చేసింది. ఓవల్ టెస్టులో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఊహించని రీతిలో పుంజుకుని అసాధారణ ఆట తీరుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ (IND vs ENG)పై ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
అయితే, భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ (Rohit Sharma) లేకుండానే.. ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా ఇలాంటి ప్రదర్శన చేయడం విశేషం. టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్.. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా మంచి మార్కులే దక్కించుకున్నాడు.
అందరూ సమిష్టిగా రాణించి
రికార్డు స్థాయిలో 754 పరుగులు సాధించడంతో పాటు.. ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, పేసర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ సత్తా చాటగా.. మహ్మద్ సిరాజ్ ఏకంగా 23 వికెట్లు కూల్చి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
సూపర్ సిరాజ్
ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన టెస్టులో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు.. టీమిండియా ఒక వికెట్ దూరంలో ఉన్న వేళ.. అద్భుత డెలివరీతో చివరి వికెట్ తీసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు ఈ హైదరాబాదీ బౌలర్.
ఈ నేపథ్యంలో గిల్ సేనతో పాటు సిరాజ్‌ను మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం.. ముఖ్యంగా దిగ్గజ బ్యాటర్ జో రూట్ సిరాజ్ నైపుణ్యాలను కొనియాడటం విశేషం.
ఓర్వలేని పాక్ మాజీ క్రికెటర్.. సంచలన ఆరోపణలు
టీమిండియా మొత్తం సంతోషంలో మునిగిన వేళ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ దాయాది జట్టుపై విద్వేషం చిమ్మాడు. బాల్ ట్యాంపరింగ్ అంటూ భారత జట్టుపై నిరాధార ఆరోపణలు చేశాడు.
‘‘నాకు తెలిసి.. ఇండియా బంతిపై వ్యాజ్‌లెన్ రాసి ఉంటుంది. అందుకే 80కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత కూడా.. బంతి ఇంకా కొత్తదానిలాగే మెరుస్తోంది. అంపైర్ ఆ బంతిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాలి’’ అని పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంతకు కుళ్లు దేనికి?
ఈ నేపథ్యంలో షబ్బీర్ అహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీమిండియా సంబరాలు చూసి ఓర్వలేకపోతున్నావా?.. దాయాది జట్టుపై ఇంత అక్కసు దేనికి?.. అక్కడా ఎవరూ అసలు దీని గురించి మాట్లాడలేదు. నీకెందుకు మరి ఈ చెత్త డౌట్ వచ్చింది.
ఓహో మీ జట్టుకు ఇలాంటివి చేయడం.. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్‌గా నీకు ఇలాంటివి బాగా అలవాటు కాబోలు. అందుకే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు టీమిండియాను చూసినా నీకు అదే అనిపిస్తోంది. అయినా ఫేమస్ అవ్వడానికి ఈ మధ్య నీలాంటి వాళ్లు బాగానే తయారయ్యారు’’ అంటూ గట్టిగా చురకలు అంటిస్తున్నారు.
కాగా పాకిస్తాన్ తరఫున 10 టెస్టులు, 32 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన షబ్బీర్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 51, 33 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20లలో బౌలర్‌గా అసలు అతడు బోణీ కొట్టలేదు.
చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే!