ఎంత డబ్బు అయినా చెల్లిస్తా!.. నాకు అక్కర్లేదు! | There is no price: Djokovic declines Medvedev Financial proposal | Sakshi
Sakshi News home page

ఎంత డబ్బు అయినా చెల్లిస్తా!.. నాకు అక్కర్లేదు!

May 1 2025 4:01 PM | Updated on May 1 2025 4:48 PM

There is no price: Djokovic declines Medvedev Financial proposal

సెర్బియా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ ఆఫర్‌ను తిరస్కరించాడు. తాను అనుకున్న శిఖరాలకు చేరిన తర్వాతే రిటైర్‌ అవుతానని.. ఆ తదనంతరమే కోచ్‌గా మారతానని స్పష్టం చేశాడు. అయితే, డానిల్‌తో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా అతడితో కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు.

కానీ ప్రస్తుతానికి అందుకు వెలకట్టలేనని జొకోవిచ్‌ చెప్పుకొచ్చాడు. కాగా స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. తాజాగా ఇటాలియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

గత మూడు టోర్నమెంట్‌లలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సెర్బియా వీరుడు... వచ్చే నెలలో జరగనున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నకి సిద్ధమయ్యేందుకు ఇటాలియన్‌ ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో 37 ఏళ్ల జొకోవిచ్‌ ఇటాలియన్‌ ఓపెన్‌ను ఉద్దేశించి ‘వచ్చే ఏడాది కలుద్దాం’ అని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవల మయామి ఓపెన్, మాంటెకార్లో మాస్టర్స్, మాడ్రిడ్‌ ఓపెన్‌లలో జొకోవిచ్‌ పరాజయం పాలయ్యాడు.

టెన్నిస్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో మరే ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన జొకోవిచ్‌... ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలవడం ద్వారా ఆ సంఖ్యను 25కు పెంచుకోవాలని చూస్తున్నాడు. మోకాలి గాయం కారణంగా గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న జొకో... శస్త్రచికిత్స అనంతరం తిరిగి సత్తా చాటాడు.

అదే విధంగా.. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జొకోవిచ్‌... పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఘనతను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.  

అయితే, గాయాల బెడద కారణంగా జొకోవిచ్‌ త్వరలోనే రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే వార్తలు రాగా.. డానిల్‌ మెద్వెదేవ్‌ స్పందించాడు. ‘‘నొవాక్‌ నా కోచ్‌ అయితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అందుకు నేను కచ్చితంగా డబ్బు చెల్లిస్తాను’’ అని పేర్కొన్నాడు. ఇందుకు జొకోవిచ్‌ పైవిధంగా బదులిచ్చాడు.

గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ చాంపియన్‌ పర్సెల్‌పై 18 నెలలు నిషేధం     
సిడ్నీ: రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచిన మ్యాక్స్‌ పర్సెల్‌పై 18 నెలల నిషేధాన్ని విధించారు. అంతర్జాతీయ టెన్నిస్‌ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఆ్రస్టేలియన్‌ ప్లేయర్‌ చెప్పాడు. అయితే ఈ కేసు డోపింగ్‌లో కాస్త భిన్నమైంది. అతను డోప్‌ టెస్టులో పట్టుబడలేదు.

అయితే గత డిసెంబర్‌లో పర్సెల్‌ తీసుకున్న విటమిన్‌ మెడిసిన్‌లో మోతాదుకు మించి ఉ్రత్పేరకాలు ఉన్నట్లు తెలింది. డోపింగ్‌ నిబంధనలకు లోబడి ఆ మెడిసిన్‌ తీసుకోవడంలో తప్పులేకపోయినా.. దాన్ని వాడిన పద్ధతి, పరిమితికి మించి ఉండటంతో శిక్ష విధించాల్సి వచ్చిందని ఐటీఐఏ తెలిపింది.

‘పర్సెల్‌ డోపీ కాదు. నిషిద్ధ ఉ్రత్పేరకాలేమీ తీసుకోలేదు. డోపింగ్‌ నిరోధక నిబంధనలు అతిక్రమించాడు’ అని ఐటీఐఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరెన్‌ మూర్‌హౌస్‌ తెలిపారు. 

తాను డోపీ కానప్పటికీ ఈ ఉదంతం తనని కుదురుగా ఉండనివ్వడం లేదని, ప్రతీ రోజు మానసిక ఒత్తిడితో సతమతమయ్యానని ఇప్పుడు ఈ శిక్షతో కాస్త ప్రశాంతంగా ఉండొచ్చని భావిస్తున్నట్లు పర్సెల్‌ చెప్పాడు. గతేడాది పర్సెల్‌.. థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి యూఎస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గాడు. 2022లో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి వింబుల్డన్‌ ట్రోఫీని సాధించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement