వెంకటేశ్‌ ప్రసాద్‌ నియామకం చెల్లదు: తెలంగాణ హైకోర్టు | Telangana HC Sets Aside HCA Appointments Include Venkatesh Prasad, More Details Inside | Sakshi
Sakshi News home page

HCA: వెంకటేశ్‌ ప్రసాద్‌ నియామకం చెల్లదు: తెలంగాణ హైకోర్టు

May 7 2025 9:29 AM | Updated on May 7 2025 10:19 AM

Telangana HC Sets Aside HCA Appointments Include Venkatesh Prasad

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే సిబ్బంది సహా కోచ్‌ల నియామకాన్ని కూడా పక్కకు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను ఆదేశించింది.

క్రికెట్‌లో నాణ్యత పెంపునకు ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (హెచ్‌సీఏఈ)లో భాగంగా కోచ్‌లు, డైరెక్టర్ల నియామకాలను హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు హైకోర్టులో సవాల్‌ చేశారు. 

హెచ్‌సీఏ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని, వీటిని నిలిపి వేయాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే పలువురితో ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రసాద్‌కు ఏటా రూ.75 లక్షల వేతనం ఇచ్చేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారన్నారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి... వెంకటేశ్‌ప్రసాద్, హిమానీ యాదవ్, మమత, అర్జున్, రాజశేఖర్‌ తదితరులకు హెచ్‌సీఏ నుంచి చెల్లించిన గౌరవ వేతనాన్ని ఈ కేసులో హెచ్‌సీఏ ప్రతివాదులైన వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని స్పష్టం చేసింది.  

శ్రీలంక క్రికెటర్లకు ఆర్‌.శ్రీధర్‌ శిక్షణ 
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ శ్రీలంక క్రికెటర్లకు కోచింగ్‌ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ సీనియర్‌ కోచ్‌ పది రోజుల శిక్షణలో  లంక జట్లకు మెళకువలు నేర్పనున్నట్లు తెలిసింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) లెవెల్‌–3 కోచ్‌ అయిన శ్రీధర్‌... లంక పురుషులు, మహిళల జట్లతో ఎమర్జింగ్, ప్రీమియర్‌ క్లబ్, అండర్‌–19, మహిళల ‘ఎ’ జట్ల క్రికెటర్లకు స్వల్పకాలిక శిక్షణ ఇస్తారని లంక బోర్డు తెలిపింది.

‘లంక క్రికెట్‌లో ఫీల్డింగ్‌ ప్రమాణాలు పెంచేందుకు ఈ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఫీల్డింగ్‌ కోచింగ్‌లో అపార అనుభవమున్న శ్రీధర్‌ భారత్‌కు ఏళ్ల తరబడి సేవలందించారు. 2014 నుంచి 2021 వరకు సుమారు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లకు టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశారు’ అని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. 

బుధవారం మొదలయ్యే ఈ 10 రోజుల కార్యక్రమంలో ఫీల్డింగ్‌ డ్రిల్స్, ప్రత్యేక నైపుణ్య శిక్షణ, మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్లుగా ఫీల్డింగ్‌ మోహరింపు విషయాల్ని శ్రీధర్‌ నేర్పించనున్నారు.   

చదవండి: ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్‌

Advertisement
 
Advertisement
Advertisement