
ఇంగ్లండ్‌తో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఓవల్ మైదానంలో గెలిచి సిరీస్ (IND vs ENG)ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే, వర్షం రూపంలో గిల్ సేనకు అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. లండన్ (London)లో గురువారం మొత్తం వాన పడే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ గురువారం నాటి తొలిరోజు ఆట గనుక వరణుడి కారణంగా రద్దయితే.. టీమిండియాకు తిప్పలు తప్పవు. ఇదిలా ఉంటే.. నిజానికి మాంచెస్టర్ (Manchester Test)లో జరిగిన నాలుగో టెస్టులోనే తాము సిరీస్ గెలిచేస్తామని ఇంగ్లండ్ ధీమా వ్యక్తం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించిన స్టోక్స్ బృందం.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే రెండు వికెట్లు తీసింది.
అయితే, గిల్ సేన అద్భుత ఆట తీరుతో ఊహించని రీతిలో తిరిగి పుంజుకుని మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోగలిగింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (90) మరోసారి తన అనుభవాన్ని చాటగా.. శుబ్‌మన్ గిల్ (103) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (107), వాషింగ్టన్ సుందర్ (101) అజేయ శతకాలతో రాణించి జట్టును గట్టెక్కించారు.
చెత్త రికార్డు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది
ఈ టెస్టులో టీమిండియా అద్భుత పోరాట కనబరిచినా.. ఓ చెత్త రికార్డు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఒక వేదికపై టెస్టుల్లో అత్యధికసార్లు గెలుపన్నదే రుచి చూడని తొలి జట్టుగా నిలిచింది.
కాగా మాంచెస్టర్‌లో భారత జట్టు ఇప్పటి వరకు పది టెస్టులు ఆడగా.. ఇందులో నాలుగు ఓడిపోయింది. తాజా మ్యాచ్‌తో కలిపి ఆరు డ్రా చేసుకుంది. ప్రపంచంలోని ఏ జట్టుకు కూడా ఇంతటి చెత్త రికార్డు లేదు. కాగా టీమిండియా ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చివరగా 1936లో గెలిచింది.
ఇక.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతు న్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా ఆతిథ్య ఇంగ్లండ్ రెండు గెలవగా.. టీమిండియా ఒక విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రా కావడంతో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య ఓవల్ మైదానంలో జూలై 31- ఆగష్టు 4 వరకు నిర్ణయాత్మక ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.
ఒక వేదికపై అత్యధిక మ్యాచ్‌లు ఆడి.. ఒక్క టెస్టు విజయమూ సాధించని జట్లు ఇవే
👉టీమిండియా: ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం, మాంచెస్టర్, ఇంగ్లండ్- ఆడినవి 10.. ఓడినవి 4.. డ్రా 6
👉ఆస్ట్రేలియా: నేషనల్ స్టేడియం, కరాచి, పాకిస్తాన్- ఆడినవి 9.. ఓడినవి 5... డ్రా 4.
👉బంగ్లాదేశ్: బంగబంధు నేషనల్ స్టేడియం, ఢాకా, బంగ్లాదేశ్- ఆడినవి 9.. ఓడినవి 7.. డ్రా 2
👉టీమిండియా: కెన్నింగ్‌స్టన్ ఓవల్, బార్బడోస్, వెస్టిండీస్- ఆడినవి 9.. ఓడినవి 7.. డ్రా 2.
👉శ్రీలంక: లార్డ్స్, లండన్, ఇంగ్లండ్- ఆడినవి 9.. ఓడినవి 3.. డ్రా 6.
చదవండి: ‘మీకు మరో దారి లేదు’.. షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది!