IND Vs SL: కోల్‌కతాలోనే సిరీస్‌ పడతారా?

Team India Eye-On ODI Series Vs Sri Lanka 2nd ODI Match Eden Gardens - Sakshi

సూపర్‌ ఫామ్‌లో భారత్‌

తప్పక గెలవాల్సిన స్థితిలో లంక

కోల్‌కతాలో నేడు రెండోవన్డే

మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

కోల్‌కతా: ఈ ఏడాది ప్రపంచకప్‌ సన్నాహాన్ని ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఇదే ఊపులో సిరీస్‌ను కోల్‌కతాలోనే ముగించాలనే పట్టుదలతో ఉంది. శ్రీలంకతో నేడు జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితి లంకది. టి20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌ ద్వారా పుంజుకున్నట్లే... ఈ పోరులోనూ గెలవాలని ఆశిస్తుంది.

ఈడెన్‌ పిచ్‌పై ఐదేళ్ల క్రితం (2017) ఆసీస్‌తో వన్డే ఆడిన భారత్‌ గెలిచింది. లంకతో మాత్రం ఈ వేదికపై 2014లో ఆడగా.. రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ (264) చేశాడు. గువహటి వన్డేలోనూ ధాటిగా ఆడిన భారత కెప్టెన్‌ తన జోరు కొనసాగిస్తే మాత్రం సింహాళ జట్టుకు కాళరాత్రే! పైగా గిల్, కోహ్లిలతో టాపార్డర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం, మళ్లీ పేస్‌ దళం చెలరేగడం భారత బలాన్ని అమాంతం పెంచుతోంది. కోల్‌కతాలో స్పిన్నర్లకు అవకాశం ఉండటంతో చహల్, అక్షర్‌ కూడా ప్రభావం చూపుతారు.  

సర్వశక్తులు ఒడ్డాల్సిందే! 
ఇప్పుడున్న భారత్‌ ఫామ్‌ను చూస్తే దుర్భేధ్యంగా ఉంది. ఇలాంటి జట్టును ఎదుర్కోవాలన్నా... ఓడించాలన్నా శ్రీలంక సర్వశక్తులు ఒడ్డాల్సిందే. సమష్టి బాధ్యత కనబరిస్తేనే పటిష్టమైన టీమిండియాను ఢీకొంటుంది. లేదంటే గత మ్యాచ్‌ ఫలితమే పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. టాపార్డర్‌లో నిసాంక మాత్రమే నిలకడగా ఆడుతున్నాడు. షనక కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో రాణిస్తున్నాడు. వీరితో పాటు ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌లు కూడా రాణిస్తేనే భారీస్కోరు చేయగలుగుతుంది. 

ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు 21 వన్డేలు ఆడింది. 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఈ వేదికపై శ్రీలంకతో ఐదు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌ రద్దయింది.

పిచ్, వాతావరణం 
ఈడెన్‌ గార్డెన్స్‌ బ్యాటర్లతో పాటు బౌలర్లకూ అవకాశమిస్తుంది. అయితే టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపుతుంది. వాన ముప్పు లేదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top