
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025) కామెంట్రీ సందర్భంగా ‘జాట్’ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో అభిమానులు సైతం వీరూ భాయ్‌పై మండిపడుతున్నారు.
సెహ్వాగ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని... ఇప్పటికైనా తన తప్పిదాన్ని గుర్తించి వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 సీజన్‌లో హర్యాన్వీ కామెంటేటర్‌ల జాబితాలో సెహ్వాగ్‌కు కూడా స్థానం దక్కింది.
తనదైన శైలిలో మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్లు, జట్ల ఆటతీరును విశ్లేషిస్తూ చణుకులు విసిరే వీరూ భాయ్.. ఈసారి మాత్రం కాస్త శ్రుతిమించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
అంత గొప్పగా ఏమీ పనిచేయవు
‘‘ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్‌లలో నివసించే జాట్లు భిన్నంగా ఉంటారు. వారి భాష కూడా వేరుగా ఉంటుంది. అయితే, అందరూ జాట్లే. అందరి మెదళ్లు అంత గొప్పగా ఏమీ పనిచేయవు’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
కాగా సెహ్వాగ్ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందినవాడే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన వర్గం గురించి తానే హాస్యం పండించేందుకు చేసిన ప్రయత్నం కాస్తా వికటించి.. విమర్శలు, వివాదానికి దారితీసింది.
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పించండి
సెహ్వాగ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ‘‘వయసు మీద పడుతుంటే హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. మరీ ఇలా చీప్ జోకులు వేస్తూ దిగజారిపోవాలా? ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పించండి. సొంత సామాజిక వర్గం పట్ల చులకన భావం ఎందుకు?
నిజానికి మీకే కాస్త బుర్ర తక్కువ. అందుకే ఇలాంటి తలతిక్క జోకులు వేస్తున్నారు. జాట్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే, సెహ్వాగ్ మాత్రం ఇంత వరకు తన వ్యాఖ్యలపై స్పందించలేదు.
విధ్వంసకర ఓపెనర్‌గా
కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన వీరేందర్ సెహ్వాగ్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున మొత్తంగా 431 ఇన్నింగ్స్‌లో కలిపి 16892 పరుగులు సాధించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో వీరూ సభ్యుడు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో ఆడిన 46 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యాటర్.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: అనుకున్నది ఒకటి.. మా వాళ్లు చేసిందొకటి.. అందుకే ఓడిపోయాం: సంజూ