అందమైన బహుమతి.. థాంక్యూ లడ్డూ: నటరాజన్‌

T Natarajan Shares Photo With Family Says Life Most Beautiful Gift - Sakshi

చెన్నై: ‘‘జీవితంలో మేము అందుకున్న అత్యంత అందమైన బహుమతి నువ్వే. మా జీవితాలు ఇంత సంతోషకరంగా మారడానికి కారణం నువ్వే. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు థాంక్యూ లడ్డూ. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. మా చిన్నారి దేవత హన్విక’’ అంటూ టీమిండియా పేసర్‌ నటరాజన్‌ తన కూతురి పేరును వెల్లడించాడు. కుమార్తె జన్మించి నాలుగు నెలలు పూర్తైన సందర్భంగా భార్య, బిడ్డతో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేసి ఈ మేరకు ఉద్వేగపూరిత కామెంట్‌ జతచేశాడు. కూతుళ్లే బెస్ట్‌ అంటూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు. 

కాగా గతేడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున నటరాజన్‌ మైదానంలో దిగి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నెట్‌బౌలర్‌గా అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో నటరాజన్‌కు కూతురు జన్మించగా, సుదీర్ఘ ఆసీస్‌ టూర్‌లో భాగంగా తనని నేరుగా చూసే అవకాశం లభించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఈ తమిళనాడు ఫాస్ట్‌బౌలర్‌ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు.

ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్‌.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీసి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఈ అదృష్టానికి తన కూతురి రాకే కారణమంటూ మురిసిపోయాడు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడే భారత జట్టులో నటరాజన్‌కు చోటు దక్కింది.  మార్చి 12 నుంచి 20 మార్చి వరకు అహ్మదాబాద్‌లోని మొటెరా స్టేడియంలో జరుగనున్న ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
చదవండి: ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్

: ‘నటరాజన్‌తో కలిసి ఆడటం నా అదృష్టం’
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top