అతడితో కలిసి ఆడటం అదృష్టం: విలియమ్సన్‌

Kane Williamson Applauds T Natarajan Fantastic Talent Amazing Guy - Sakshi

న్యూఢిల్లీ: ‘‘నటరాజన్‌ అద్భుతమైన వ్యక్తి. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో గొప్పగా రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. వాస్తవానికి తను నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే వారవారానికి తనకున్న అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయి. గబ్బా టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయంలో తన పాత్ర కూడా ఉండటం నిజంగా సంతోషకరం. ఇంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి నాకు సహచర ఆటగాడు(ఐపీఎల్‌) కావడం పట్ల గర్వంగా ఉంది’’ అంటూ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టీమిండియా బౌలర్‌ తంగరసు నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో తనతో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

కాగా ఆసీస్‌ టూర్‌లో భాగంగా మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తమిళనాడు సీమర్‌ నట్టు.. ఆ తర్వాత టీ20, సంప్రదాయ క్రికెట్‌లో కూడా అడుగుపెట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3)  వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తనను నిరూపించుకున్న నటరాజన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఈ క్రమంలో విలియమ్సన్‌ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. అద్భుతమైన ప్రతిభ కలవాడు. టీమిండియాకు దొరికిన మంచి ఆటగాడు. అతి తక్కువ సమయంలోనే, యువ క్రికెటర్‌ నుంచి పరిణతి కలిగిన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. (చదవండి: నటరాజన్‌ అరంగేట్రం.. అద్భుతమైన కథ!)

నాతో కలిసి ఆడిన నటరాజన్‌, ఆసీస్‌ టూర్‌లో సాధించిన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది’’ అని విలియమ్సన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన నటరాజన్‌, 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఇక కేన్‌ విలియమ్సన్‌ సైతం ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ తుది పోరుకు కివీస్‌ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత విలియమ్సన్‌ సేనతో ఫైనల్‌లో తలపడే జట్టు ఏదో ఖరారు కానుంది.(చదవండి: ఫైనల్‌కు న్యూజిలాండ్)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top