నటరాజన్‌ అరంగేట్రం.. అద్భుతమైన కథ!

T Natarajan ODI Debut in Australia Dream Come True Canberra Match - Sakshi

నటరాజన్‌పై క్రికెట్‌ దిగ్గజాల ప్రశంసలు

కాన్‌బెర్రా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టి.నటరాజన్‌ ఎట్టకేలకు టీమిండియా తుది జట్టులో సంపాదించుకున్నాడు. తద్వారా భారత జట్టుకు ఆడాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మహ్మద్‌ షమీ స్థానాన్ని భర్తీ చేసిన నటరాజన్‌.. అరంగేట్ర మ్యాచ్‌లో తొలుత లబుషేన్‌ వికెట్‌ తీసి ప్రత్యర్థి జట్టును ఇరకాటంలోకి నెట్టాడు. కెప్టెన్‌ కోహ్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ఈ యార్కర్ల వీరుడు బౌలింగ్‌ను కొనసాగిస్తున్నాడు.  

కాగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న నటరాజ్‌ ప్రయాణంపై క్రికెట్‌ దిగ్గజాలు ఇయాన్‌ బిషప్‌, టామ్‌ మూడీ ప్రశంసలు కురిపించారు. ‘‘ఈరోజు తను బాగా ఆడినా, ఆడకపోయినా సరే.. టి. నటరాజన్‌.. మనసును హత్తుకునే కథ తనది’’ అంటూ ఇయాన్‌ బిషప్‌ కొనియాడగా.. ‘‘నేడు నటరాజన్‌ భారత్‌ తరఫున అరంగేట్ర మ్యాచ్‌ ఆడబోతున్నాడు. తన కల ఈరోజు నిజమైంది. అత్యుద్భుతమైన స్టోరీ నటరాజన్‌ది’’ అని టామ్‌ మూడీ కితాబిచ్చాడు. (చదవండి: ‘ఏంటిది కోహ్లి.. మమ్మల్ని ఇంతలా నిరాశపరిచావు’)

ఎవరీ నటరాజన్‌?!
తమిళనాడులోని సేలం సమీపంలో గల చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్‌ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. కనీసం పుస్తకాలు, పెన్సిళ్లు కూడా కొనుక్కోలేని దీనస్థితిని ఎదుర్కొన్నాడు. నటరాజన్‌ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్‌ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్‌ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్‌ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్‌ బాల్‌తోనే ప్రాక్టీసు చేశాడు.(చదవండి: అదరగొట్టిన పాండ్యా, జడేజా; 300 దాటిన స్కోరు!)

నటరాజన్‌ ఆసక్తిని గమనించిన జయప్రకాశ్‌ అనే వ్యక్తి అతడికి అండగా నిలబడ్డాడు. ఆయన ప్రోత్సాహంతోనే 2011లో తనకు టీఎన్‌సీఏ 4వ డివిజన్‌ క్రికెట్‌లో పాల్గొనే అవకాశం లభించిందని, ఆయనే తన గాడ్‌ఫాదర్‌ అని నటరాజన్‌ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. అంతేగాక ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున మైదానంలో దిగిన ఈ యార్కర్‌ కింగ్‌ తన షర్టుపై జేపీ నట్టు అనే పేరును ముద్రించుకుని జయప్రకాశ్‌పై అభిమానం చాటుకున్నాడు. 

కాగా నటరాజన్‌ 2015లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్‌ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్‌ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్‌ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్‌ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్‌ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు.

రూ. 3 కోట్లకు కొనుక్కున్న పంజాబ్.. కానీ!‌
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు 2017లో నటరాజన్‌ను కొనుగోలు చేసింది. అక్షరాలా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. దీంతో పంజాబ్‌ అతడిని వదులుకుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ యాజమాన్యం 2018లో కేవలం 40 లక్షలు పెట్టి నటరాజన్‌ను కొనుక్కుంది. హైదరాబాద్‌ జట్టులో చేరిన తర్వాత రెండు సీజన్లపాటు బెంచ్‌కే పరిమితమైన నటరాజన్‌.. సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో 13 వికెట్లు(11 మ్యాచ్‌లు) తీసి మరోసారి సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్‌-2020లో ఆడే అవకాశం లభించింది.

ఇక సన్‌రైజర్స్ తరఫున ఆడిన నటరాజన్‌ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా కెప్టెన్‌, ఆర్సీబీ సారథి కోహ్లి వికెట్ తీసి పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సీజన్‌లో మొత్తంగా 16వికెట్లు తీసి తనదైన ముద్రవేశాడు. ముఖ్యంగా ప్లేఆఫ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిల్లియర్స్‌ను అద్భుతమైన యార్కర్‌తో పెవిలియన్‌కు చేర్చిన తీరుపై ప్రశంసలు కురిశాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌.. ‘‘ఐపీఎల్‌లో నా హీరో నటరాజన్‌’’ అంటూ కితాబిచ్చాడు.

అకాడమీ స్థాపించి!
అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో చోటు సంపాదించుకున్న నటరాజన్‌ తమ గ్రామంలోనే తన మెంటార్‌తో కలిసి ఓ క్రికెట్‌ అకాడమీని స్థాపించాడు. తనకున్న వనరుల సాయంతో పేదరికంలో మగ్గుతున్న ఔత్సాహిక క్రికెటర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాడు. క్రికెటర్లు కావాలన్నవారి కలను నెరవేర్చుకునేందుకు తనవంతు సాయం అందిస్తున్నాడు. కాగా నటరాజన్‌ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతడి భార్య పవిత్ర నవంబరు 7న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అదే సమయంలో ఇక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైనట్లు సమాచారం అందడంతో పాప వల్లే తనకు అదృష్టం వచ్చిందంటూ అతడు మురిసిపోయాడు. ఇక ఇప్పుడు వన్డేల్లో అరంగేట్రం చేయడంతో అతడి సంతోషం రెట్టింపు అయ్యింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top