‘ప్రాక్టీస్‌ వద్దంటే గోల చేసేవాడు.. తను లెజెండ్‌ అవుతాడు’

Washington Sundar Father Says Feels Proud Of Team India - Sakshi

వాషింగ్టన్‌ సుందర్‌ తల్లిదండ్రుల పుత్రోత్సాహం

న్యూఢిల్లీ: ‘‘ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకం. వాషింగ్టన్‌ సుందర్‌ లెజెండ్‌గా ఎదుగుతాడు. తనకు ప్రతిభ, నైపుణ్యాలతో పాటు, ఆట పట్ల అంకితభావం, కఠిన శ్రమ, క్రమశిక్షణ కూడా ఉన్నాయి. భారత జట్టులో సుదీర్ఘ కాలంపాటు తన ఇన్నింగ్స్‌ కొనసాగించగలడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అంటూ టీమిండియా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి సుందర్‌ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఆస్ట్రేలియాలో భారత్‌ సాధించిన ఘన విజయంలో తన ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు దూరమైన తరుణంలో వాషింగ్టన్‌కు తుది జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యువ స్పిన్నర్‌‌.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. (చదవండి: ఆసీస్‌ టూర్‌: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)

అదే విధంగా కీలక సమయంలో రిషభ్‌పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆసీస్‌ పర్యటన ముగించుకుని టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి సుందర్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌, అశ్విన్‌, టి. నటరాజన్‌ వీరితో పాటు టీమిండియా మొత్తాన్ని చూస్తుంటే గర్వంతో హృదయం ఉప్పొంగిపోతోంది. వాషింగ్టన్‌ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తన ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా’’అని చెప్పుకొచ్చారు. 

వద్దంటే రభస చేసేవాడు
‘‘రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి గ్రౌండుకు, అక్కడి నుంచి స్కూలు వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే హోం వర్‌​ పూర్తి చేసి మళ్లీ ప్రాక్టీసుకు వెళ్లేవాడు. ఒకవేళ ఏదైనా కారణాల చేత అక్కడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లో రభస చేసేవాడు. వర్షం పడుతున్నా సరే ఆటను విడిచిపెట్టేవాడు కాదు’’ అని క్రికెట్‌ పట్ల కొడుకుకు ఉన్న అంకితభావం గురించి వాషింగ్టన్‌ తల్లి చెప్పారు. అదే విధంగా.. ‘‘చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం మా ఇద్దరికి అలవాటు. తన బౌలింగ్‌ కంటే బ్యాటింగే ఎక్కువగా ఆస్వాదిస్తాను. తనకు నేను వీరాభిమానిని’’ అని అతడి సోదరి జ్యోతి సుందర్‌ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక ఆసీస్‌ టూర్‌లో తమిళ యువ ఆటగాళ్లు వాషింగ్టన్‌ సుందర్(టెస్టు)‌, నటరాజన్(వన్డే, టీ20, టెస్టు)‌ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top