
దివ్య దేశ్‌ముఖ్‌పై సుసాన్ పోల్గర్ ప్రశంసలు
న్యూఢిల్లీ: మహిళా చెస్ దిగ్గజం సుసాన్ పోల్గర్ భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసలు కురిపించింది. వరల్డ్ కప్‌లో వేర్వేరు సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దివ్య గెలిచిన తీరు అద్భుతమని ఆమె వ్యాఖ్యానించింది. మానసిక దృఢత్వం, పోరాటతత్వమే ఆమెను చాంపియన్‌గా నిలిపిందని పోల్గర్ అభిప్రాయపడింది. ‘చారిత్రక విజయం సాధించిన దివ్యకు నా అభినందనలు. చాలా బాగా ఆడింది. టోర్నీకి ముందు ఫేవరెట్‌లలో ఆమె పేరు లేదు.
అయితే గెలవాలనే పట్టుదల, మానసిక దృఢత్వంతో ఆమె ముందంజ వేయగలిగింది. టోర్నీలో దివ్య ఇబ్బంది పడిన గేమ్‌లు ఉన్నాయి. మంచి అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఆమెపై పడలేదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఆమె పోరాడింది. అదే పట్టుదల చివరి వరకు నిలిచి గెలిచేలా చేశాయి’ అని పోల్గర్ వ్యాఖ్యానించింది. ప్రపంచ చెస్‌లో ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలు అపూర్వమని ఆమె పేర్కొంది.
వీరందరికీ గొప్ప భవిష్యత్తు ముందుందని పోల్గర్ జోస్యం చెప్పింది. ‘గుకేశ్ పెద్ద స్థాయికి చేరతాడని అతనికి 12 ఏళ్లు ఉన్నప్పుడే నేను చెబితే ఎవరూ నమ్మలేదు. 50 మంది గ్రాండ్‌మాస్టర్లను తయారు చేసిన నా అనుభవంతో ఆ వ్యాఖ్యలు చేశాను. దివ్య విషయంలో కూడా అదే జరిగింది. పెద్ద ప్లేయర్‌గా గుర్తింపు లేకపోయినా ఆమెలో ప్రత్యేక ప్రతిభ ఉంది కాబట్టే ఈ స్థాయిలో గెలిచింది. ప్రస్తుతం భారత చెస్‌లో స్వర్ణయుగం నడుస్తోంది. వారి ఆట గొప్పగా ఉండటంతో పాటు సరైన రీతిలో మద్దతు, దిశానిర్దేశం లభిస్తున్నాయి.
దివ్య ఇక్కడితో ఆగిపోవద్దు. ఆమె ఆటపై అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి మరింతగా కష్టపడి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. హంపి అంటే కూడా నాకు గౌరవం ఉంది. సుదీర్ఘ కాలం ఆమె అగ్రస్థాయిలో కొనసాగింది. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారడం సహజం’ అని పోల్గర్ పేర్కొంది.