క్రికెట్‌లో భారత్ ప్రపంచాన్ని శాసించడం చూడాలనుకున్న తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని టీమిండియా మహిళా దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. ఆదివారం బీసీసీఐ నమన్ అవార్డ్స్ సందర్భంగా మిథాలీరాజ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఎంతోకాలంగా నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గ్లోబల్ క్రికెట్‌లో భారత్ అన్ని విభాగాల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వస్తోంది.
గత రెండు మూడేళ్లలో పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్-19 జట్లు ట్రోఫీలు కొల్లగొట్టి భారత క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇక మహిళల క్రికెట్‌లోనూ గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు బీసీసీఐతో పాటు జైషాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే.
ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో భారత మహిళల క్రికెట్ జట్టు ఎంతో పరిణితి చెందడంతో పాటు ఆటలోనూ దూకుడు పెరిగింది. భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరగడానికి నన్ను అందరూ ఐకాన్‌గా చెప్పుకుంటున్నారు. కానీ నేను నిజానికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సర్‌ల నుంచి ప్రేరణ పొంది ఇవాళ ఈ స్థాయిలో నిలిచాను.
మహిళల జట్టుకు ప్రేరణ మాత్రం ఎప్పుడు పురుషుల జట్టే అని బలంగా చెప్పగలను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక భారత క్రికెట్ గత రెండు మూడేళ్లలో ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదిగింది. గత రెండేళ్లలో చూసుకుంటే పురుషుల జట్టు రెండుసార్లు, మహిళల జట్లు ఒకసారి, అండర్-19 జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు కొల్లగొట్టాయి.
తొలుత 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 17 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టైటిల్ సాధించింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సూర్య సారథ్యంలో టీమిండియా మూడోసారి కైవసం చేసుకుంది. ఆ తర్వాతి ఏడాది మహిళల జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక అండర్-19లోనూ అటు పురుషులు, మహిళల విభాగంలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.


