కార్తీక్ వెంకటరామన్ ముందంజ
‘టైబ్రేక్’ పోరుకు లలిత్ బాబు, రాజా రిత్విక్
పనాజీ: ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన భారత గ్రాండ్‌మాస్టర్, మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్... స్వదేశంలో జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఈ టోర్నీలో పోటీపడుతున్న 206 మంది క్రీడాకారుల్లో ఏకైక మహిళా క్రీడాకారిణి అయిన దివ్య ఆడిన రెండు గేముల్లోనూ ఓడిపోయింది. గ్రీస్ గ్రాండ్‌మాస్టర్ అర్డిటిస్ స్టామటిస్ 2–0తో దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
శనివారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో 41 ఎత్తుల్లో ఓడిపోయిన దివ్య... టోర్నీలో నిలవాలంటే ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో కచ్చితంగా గెలవాల్సింది. అయితే రెండో గేమ్‌లో దివ్య 71 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరోవైపు భారత పురుష గ్రాండ్‌మాస్టర్లు కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్), ప్రణవ్ (తమిళనాడు), రౌనక్ సాధ్వాని (మహారాష్ట్ర), ప్రాణేశ్ (తమిళనాడు), ఇనియన్ (తమిళనాడు), సూర్యశేఖర గంగూలీ (బెంగాల్) తొలి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.
ప్రణవ్ 2–0తో బుల్‌రెన్స్ (అల్జీరియా)పై, రౌనక్ 1.5–0.5తో డానియల్ బారిష్ (దక్షిణాఫ్రికా)పై, ప్రాణేశ్ 2–0తో సత్బేక్ (కజకిస్తాన్)పై, ఇనియన్ 1.5–0.5తో బెర్దాయెస్ (క్యూబా)పై, కార్తీక్ వెంకటరామన్ 1.5–0.5తో రొబెర్టో గార్సియా (కొలంబియా)పై, సూర్యశేఖర గంగూలీ 2–0తో అహ్మదాజాదా అహ్మద్ (అజర్‌బైజాన్)పై గెలుపొందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్, ఎస్‌ఎల్ నారాయణన్, దీప్తాయన్ ఘోష్ భవితవ్యం నేడు తేలనుంది.
ఈ నలుగురు ఈరోజు జరిగే టైబ్రేక్ గేముల్లో తలపడతారు. మాక్స్ వెర్మెర్‌డామ్ (నెదర్లాండ్స్)–లలిత్ బాబు; నొగెర్‌బెక్ కాజీబెక్ (కజకిస్తాన్)–రాజా రిత్విక్ మధ్య జరిగిన నిర్ణీత రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో 1–1తో సమంగా ఉన్నారు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు లియోన్ మెండోంకా, నీలేశ్ సాహా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. లియోన్ 0.5–1.5తో వాంగ్ షిజు (చైనా) చేతిలో, నీలేశ్ 0.5–1.5తో మియెర్ జార్జి (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయారు.


