
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను దివ్య 103 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఇటీవల మహిళల ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన దివ్య రేటింగ్ 2478 పాయింట్లు కాగా... గుకేశ్ రేటింగ్ 2767 పాయింట్లు.
ఈ టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుకేశ్ ‘డ్రా’తో గట్టెక్కాడు. ఎనిమిదో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ప్రణవ్, అభిమన్యు పురాణిక్, లియోన్, ఆదిత్య మిట్టల్, రౌనక్ సాధ్వాని, నారాయణన్, ఆర్యన్ చోప్రా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... విదిత్, పెంటేల హరికృష్ణ ఓటమి చవిచూశారు. కార్తికేయన్ మురళీ మాత్రం విజయాన్ని అందుకున్నాడు.
మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి తొలి ఓటమి చవిచూసింది. బీబీసారా అసబయేవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్‌లో వైశాలి 39 ఎత్తుల్లో ఓడిపోయింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఎనిమిదో రౌండ్ తర్వాత వైశాలి 6 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో, హారిక 4.5 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నారు.