
33 పరుగుల తేడాతో సూపర్‌జెయింట్స్ గెలుపు
సెంచరీతో చెలరేగిన మార్ష్
పూరన్ మెరుపు అర్ధసెంచరీ
అహ్మదాబాద్: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ తదుపరి లక్ష్యం టాప్–2లో చేరడం. ఈ ప్రయత్నానికి లక్నో సూపర్‌జెయింట్స్ అడ్డొచ్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతక్కొట్టగా, నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. షారుఖ్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూథర్‌ఫర్డ్ (22 బంతుల్లో 38; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. క్యాన్సర్ అవగాహన–ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ఒక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ రంగు జెర్సీతో బరిలోకి దిగింది.
ఓపెనింగ్ ధాటితో...
ఓపెనర్లు మార్ష్, మార్క్‌రమ్ జోడీ లక్నోకు శుభారంభం ఇచ్చింది. గుజరాత్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడటంతో 5.3 ఓవర్లో లక్నో స్కోరు ఫిఫ్టీ దాటింది. మరోవైపు నుంచి మార్క్‌రమ్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా షాట్లతో పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో మార్ష్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ మార్క్‌రమ్‌ను కిషోర్ అవుట్ చేసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రషీద్‌ఖాన్‌పై మార్ష్ పిడుగల్లే చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 1లతో ఏకంగా 25 పరుగుల్ని రాబట్టాడు.
మార్ష్ సెంచరీ, పూరన్ ఫిఫ్టీ
మార్‡్షతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో ప్రతీ ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. మార్ష్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాసేపటికే పూరన్ కూడా 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో లక్నో 17.4 ఓవర్లలో 200 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేక్రమంలో మార్ష్ అవుట్‌కాగా... రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పూరన్‌తో పంత్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు.
షారుఖ్ పోరాడినా...
కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆరంభం నుంచే దంచేందుకు దిగిన టాపార్డర్ బ్యాటర్లు అంతే వేగంగా వికెట్లు పారేసుకున్నారు. సాయి సుదర్శన్ (21; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో లక్నో శిబిరం సంబరం చేసుకుంది. కానీ రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్‌లు ధనాధన్ షోకు శ్రీకారం చుట్టడంతో లక్నో గుండెల్లో గుబులు రేగింది. చెరోవైపు నుంచి రూథర్‌ఫొర్డ్, షారుఖ్‌లు సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించారు. అంతే... 16 ఓవర్లు గడిచేసరికి స్కోరు 182/3కి చేరింది.
24 బంతుల్లో 54 పరుగుల సమీకరణం గుజరాత్‌ను ఆశల పల్లకిలో ఉంచింది. రూథర్‌ఫొర్డ్, షారుఖ్ నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్లో రూథర్‌ఫర్డ్, తెవాటియా (2), మరుసటి ఓవర్లో అర్షద్ ఖాన్ (1) అవుట్ కావడంతో లక్నో కు ఊరట లభించింది. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ పోరాటం సరిపోలేదు.
స్కోరు వివరాలు
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) షారుక్ (బి) సాయి కిషోర్ 36; మార్ష్ (సి) రూథర్‌ఫొర్డ్ (బి) అర్షద్ 117; పూరన్ నాటౌట్ 56; రిషభ్ పంత్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–91, 2–212. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 3–0–36–1, రబడ 4–0–45–0, ప్రసి«ద్‌కృష్ణ 4–0–44–0, సాయి కిషోర్ 3–0–34–1, రషీద్ ఖాన్ 2–0–36–0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) మార్క్‌రమ్ (బి) రూర్కే 21; గిల్ (సి) సమద్ (బి) అవేశ్ 35; బట్లర్ (బి) ఆకాశ్ సింగ్ 33; రూథర్‌ఫర్డ్ (సి)సబ్–బిష్ణోయ్ (బి) రూర్కే 38; షారుఖ్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) అవేశ్ 57; తెవాటియా (సి) హిమ్మత్ (బి) రూర్కే 2; అర్షద్ (సి) రూర్కే (బి) షాబాజ్ 1; రషీద్ ఖాన్ నాటౌట్ 4; రబడా (బి) బదోని 2; సాయి కిషోర్ (బి) బదోని 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–96, 4–182, 5–186, 6–193, 7–197, 8–200, 9–202. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3.1–0–29–1, ఆకాశ్‌దీప్ 4–0–49–0, రూర్కే 4–0–27–3, అవేశ్‌ఖాన్ 3.5–0–51–2, షాబాజ్ 4–0–41–1, బదొని 1–0–4–2.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X హైదరాబాద్
వేదిక: లక్నో
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో