
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడ్డ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానాన్ని సీనియర్ శార్దూల్ ఠాకూర్‌తో భర్తీ చేసిన యాజమాన్యం.. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్‌ను అరంగేట్రం చేయించింది.
కరుణ్‌పై వేటు
ఇక వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు వేసిన సెలక్టర్లు.. తొలి టెస్టులో ఆడిన సాయి సుదర్శన్‌ను మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చేర్చారు. అయితే, ఈ తుదిజట్టు కూర్పుపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ విమర్శలు గుప్పించాడు. ఏ ప్రాతిపదికన అన్షుల్ కంబోజ్‌కు అవకాశం ఇచ్చారని ప్రశ్నించాడు.
క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ వచ్చాడు. ఆకాశ్ దీప్ ఆడటం లేదు కాబట్టి.. అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేశాడు. ఇక శార్దూల్ ఠాకూర్ పునరాగమనం కూడా ఆసక్తికరమే.
ప్రసిద్ ఫిట్‌గా ఉన్నాడు
యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయినప్పటికీ.. అకస్మాత్తుగా అతడిని పక్కనపెట్టారు. తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు.
అన్షుల్ అరంగేట్రం ఎలా సాధ్యం?
నిజానికి అన్షుల్ కంబోజ్ మొదటి నుంచి జట్టులో భాగమే కాదు. అతడి కంటే ముందు హర్షిత్ రాణా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. కొత్తగా వచ్చిన అన్షుల్ అరంగేట్రం చేశాడు.
అసలు మేనేజ్‌మెంట్ ఆలోచన ఎలా ఉందో.. వారు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అంటూ మురళీ కార్తిక్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
సాయి సుదర్శన్‌పై ప్రశంసలు
అదే విధంగా.. సాయి సుదర్శన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తొలి రోజు ఆటలో అతడే హైలైట్. అతడు క్రీజులో ఉన్నపుడు వికెట్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేమీ లేదు. అయినా సరే సాయి అదరగొట్టాడు. అందుకే అతడు ప్రశంసలకు అర్హుడు’’ అని మురళీ కార్తిక్ కొనియాడాడు.
తొలిరోజు మెరుగ్గానే
కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఇంగ్లండ్ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉండగా... మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) రాణించగా.. సాయి సుదర్శన్ అద్భుత అర్ధ శతకం(61)తో ఆకట్టుకున్నాడు.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. రిషభ్ పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 19, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్