
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో ఇవాళ (మే 7) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా రోడ్రిగెజ్ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్‌సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.
ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. భారత్ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది.