ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష‍్యంగా... | Special focus on star wrestler Sujeet Kalkal Ground Game | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష‍్యంగా...

Oct 8 2026 3:56 AM | Updated on Oct 8 2026 3:58 AM

Special focus on star wrestler Sujeet Kalkal Ground Game

స్టార్‌ రెజ్లర్‌ సుజీత్‌ కల్కల్‌ ‘గ్రౌండ్‌ గేమ్‌’పై స్పెషల్‌ ఫోకస్‌

ఆసియా క్రీడల స్వర్ణంతో కొత్త ఉత్సాహంతో ప్రాక్టీస్‌

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ కోసం సన్నాహాలు  

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో సత్తా చాటిన భారత రెజ్లర్‌ సుజీత్‌ కల్కల్‌... 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లోనూ ఇదే దూకుడు కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జపాన్‌ వేదికగా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో స్వర్ణం కైవసం చేసుకున్న సుజీత్‌... కోచ్‌ల సూచనతో తన ఆటలో పలు మార్పులు చేసుకోవడం వల్లే అగ్రస్థానంలో నిలవగలిగానని తెలిపాడు. సాధారణంగా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రాధాన్యం ఇచ్చే సుజీత్‌... గ్రౌండ్‌ గేమ్‌లో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు.

 ‘నా బౌట్‌లలో చేసే తప్పిదాలపై మరింత దృష్టి పెట్టా. ‘గ్రౌండ్‌ గేమ్‌’ విషయంలో నా పట్టులో కొన్ని బలహీనతలు ఉన్నట్లు కోచ్‌లు గుర్తించారు. దీంతో ఇక మీదట దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ‘గ్రౌండ్‌ గేమ్‌’ను మెరుగు పరుచుకుంటూనే... ప్రత్యర్థిపై ప్రతిదాడి చెయడంపై సాధన చేస్తా. అలాగే డిఫెన్స్‌ కూడా చాలా ముఖ్యం’ అని సుజీత్‌ అన్నాడు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బుధవారం నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో సుజీత్‌ పాల్గొన్నాడు. 

ఈ ఏడాది ఆరంభంలో రష్యాలో జరిగిన ఓ బౌట్‌లో సుజీత్‌ గెలిచినప్పటికీ... ఆశించిన స్థాయిలో ప్రత్యర్థిపై దాడి చేయడం లేదని జాతీయ రెజ్లింగ్‌ కోచ్, జార్జియాకు చెందిన ఎంజారియోస్‌ ‘షాకో’ బెంటినిడిస్‌ గుర్తించాడు. ఇదే అంశంపై దృష్టి పెట్టిన సుజీత్‌... ఆసియా క్రీడల్లో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాడు. ‘బౌట్‌ ఆరంభమైన తర్వాత దాడి చేసే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోలేదు. ఆసియా క్రీడల్లో ప్రతి బౌట్‌లో నేను అటాకింగ్‌ ద్వారానే పాయింట్లు సాధించా’ అని సుజీత్‌ పేర్కొన్నాడు.  

దుబాయ్‌ వరదల్లో చిక్కుకొని...  
రెండేళ్ల క్రితం 2024 పారిస్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనేందుకు బిష్‌కెక్‌ బయలుదేరిన సుజీత్‌... దుబాయ్‌లో చిక్కుకుపోయాడు. వరదల కారణంగా అతడి కల నెరవేరలేకపోయింది. మూడు రోజుల పాటు దుబాయ్‌లోనే ఉన్న సుజీత్‌... అనంతరం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా... సమయానికి బిష్‌కెక్‌ చేరుకోలేక... పోటీలకు దూరమయ్యాడు. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన 23 ఏళ్ల సుజీత్‌... తన నియంత్రణలో లేని అంశాల గురించి ఎక్కువ ఆలోచించనని వెల్లడించాడు. 

‘పారిస్‌లో జరిగినదంతా జరిగిపోయింది. దాని మార్చలేము. అలాంటప్పుడు దాని గురించి ఆలోచించడం వృథా. ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి... భవిష్యత్తుపై దృష్టిపెట్టడంతోనే ఇప్పుడు ఆసియా క్రీడల్లో పతకం సాధించగలిగా. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నా’ అని సుజీత్‌ వివరించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఘటనను పక్కనపెట్టి 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతున్నట్లు సుజీత్‌ వెల్లడించాడు. ‘ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఒక్కరి కల. నా లక్ష్యం కూడా అదే. విశ్వక్రీడల్లో స్వర్ణం నెగ్గి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని అనుకుంటున్నా’ అని సుజీత్‌ అన్నాడు. 

పడిలేచిన కెరటం... 
ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కల నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సుజీత్‌... అందులో నుంచి త్వరగానే కోలుకొని తిరిగి మ్యాట్‌పై సత్తాచాటడం అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో అతడి ప్రదర్శన ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ముఖ్యంగా ఫైనల్లో 2–9తో వెనుకబడి ఇక పరాజయం తప్పదు అనుకుంటున్న దశలో అతడు తిరిగి పుంజుకున్న తీరు... అద్భుతమనే చెప్పాలి. ‘నాకు తెలిసింది పోరాడటం ఒక్కటే. ఓడినా గెలిచినా చివరి వరకు దాన్ని కొనసాగిస్తా. నా చివరి శ్వాస వరకు పోరాడటం నా బాధ్యత. మిగిలి ఉన్న శక్తినంతా ధారపోసి ప్రయత్నించా. దీంతో చివర్లో ప్రత్యర్థిని పడగొట్టగలిగా’ అని సుజీత్‌ అన్నాడు. 

ఈ పతకం అనంతరం తనపై అంచనాలు పెరగడం ఖాయమన్న సుజీత్‌... అయితే ఆ ఒత్తిడిని దరిచేరనివ్వనని వెల్లడించాడు. ‘మ్యాట్‌పై అడుగు పెట్టాక వంద శాతం కష్టపడతా. విజయం సాధించినప్పుడు సంతోషం కలగడం సహజం. అంతేకాని దాన్ని ఒత్తిడిగా మార్చుకోను. ఎందుకంటే... ఒత్తిడిలో ఉన్న వ్యక్తి పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించలేడని బలంగా విశ్వసిస్తా’ అని సుజీత్‌ పేర్కొన్నాడు. గెలిచినా ఓడినా ఒకే రీతిలో ఉంటానన్న సుజీత్‌... ఓడితే నా లోపాలపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నాడు.  

తండ్రి కల... 
సుజీత్‌ నిలకడైన విజయాల వెనుక అతడి తండ్రి దయానంద్‌ కృషి ఎంతో ఉంది. కెరీర్‌ ఆరంభం నుంచి సుజీత్‌ను చాంపియన్‌గా చూడాలనుకున్న దయానంద్‌... చిన్నప్పటి నుంచే అతడిలో విజయకాంక్షను నూరిపోశారు. దానివల్లే సుజీత్‌ అంతర్జాతీయ స్థాయిలో వరుసగా 24 బౌట్‌లలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్నాడు. ‘తన కొడుకు దేశం కోసం పసిడి పతకం సాధించేంత సమర్థుడిగా ఎదగాలన్నది మా నాన్నగారి కల. అందుకే ఏషియన్‌ గేమ్స్‌ మెడల్‌తో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే నేను ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలవగలనని కూడా ఆయన విశ్వసిస్తున్నారు. ఆ కల ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇక నా దృష్టి దానిపైనే పెడతా. 

నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా నాన్నే. కేలం ఆట గురించే కాదు జీవితం గురించి కూడా ఆయన నాకు ఎంతో నేర్పారు. తోటివారికి సహాయం చేయడం, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఇలాంటివన్నీ ఆయన నుంచే నేర్చుకున్నా’ అని సుజీత్‌ వివరించాడు. ఆసియా క్రీడల స్వర్ణ సంబరాల అనంతరం కజకిస్తాన్‌ వేదికగా ఈ నెలాఖరున జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నట్లు అతడు తెలిపాడు. దేశం కోసం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిస్తే అదే తనకు దీపావళి అని సుజీత్‌ ముగించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement