source: X
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్లు ఘోరంగా తడబడ్డారు. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం కలిగినప్పటికీ.. ఆసీస్ బౌలర్ల ధాటికి స్వదేశంలో 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ చెత్త రికార్డును నమోదు చేశారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. స్వదేశంలో చివరిసారిగా 1966 జోహన్నెస్‌బర్గ్ టెస్టులో ఇలాంటి పరిస్థితిని (35 పరుగులకే నాలుగు వికెట్లు) ఎదుర్కొన్న ఆ జట్టు.. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే తరహా పతనాన్ని చవిచూసింది.
అయితే నాడు పతనమైనా సౌతాఫ్రికా ఆ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులే చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 620 పరుగులు చేసి, చివరకు 233 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది. ప్రస్తుత టెస్టులోనూ అదే తరహాలో పుంజుకోవాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది.
కుప్పకూలిన టాపార్డర్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మేఘావృత వాతావరణం, తేమతో కూడిన పరిస్థితులు ఆసీస్ బౌలర్లకు అనుకూలంగా మారాయి. పేసర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
స్కాట్ బోలాండ్ ఇన్‌ఫామ్ బ్యాటర్ మార్క్రమ్ (11)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా పతనం మొదలైంది. ఆ తర్వాతి బంతికే డేవిడ్ బెడింగ్‌హామ్ (0)వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో రోజు అరంగేట్ర ఆటగాడు మార్కస్ అకెర్‌మన్ (6) వికెట్‌ను కోల్పోయాడు.
అనంతరం మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కే (4) ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ బవుమా (41 నాటౌట్), రికెల్టన్ (31) కాస్త ప్రతిఘటించాడు. అయితే బోలాండ్ రికెల్టన్ ఆట కట్టించి సౌతాఫ్రికాను మరోసారి దెబ్బేశాడు. బవుమాతో పాటు ముల్దర్ (2) క్రీజ్‌లో ఉన్నాడు.
ఇదీ చదవండి: రషీద్ మాయాజాలం.. ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం


