తొలి రోజు భారత్‌కు 4 స్వర్ణాలు
మొత్తం 11 పతకాలు గెలుచుకున్న బృందం
ఆసియా పారా క్రీడలు
నగోయా: ఆసియా పారా క్రీడల్లో భారత ఆటగాళ్లు తొలి రోజే పెద్ద సంఖ్యలో పతకాలతో మెరిశారు. సోమవారం నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత బృందం మొత్తం 11 పతకాలు గెలుచుకోవడం విశేషం. ఇందులో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. పారా అథ్లెట్‌గా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లు అంచనాలకు అనుగుణంగా ప్రదర్శన కనబర్చగా, పలువురు కొత్త ప్లేయర్లు తొలిసారి ఆసియా పారా క్రీడల్లో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుడిగిన రవి కార్తీక్ స్విమ్మింగ్‌లో రజతం నెగ్గడం ప్రస్తావనార్హం.
అథ్లెటిక్స్‌లో 3 స్వర్ణాలు...
పతకాల ఖాతాలో భారత అథ్లెట్లు ఆధిక్యం ప్రదర్శించారు. మన అథ్లెట్లే 3 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–46 ఈవెంట్‌లో భారత్‌కు 2 పతకాలు దక్కాయి. రింకూ హుడా (65.11 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా, అజీత్ సింగ్ (65.02 మీటర్లు) రజతం సాధించాడు. సక్‌తోనో రిజాల్ (ఇండోనేసియా; 55.30 మీ.) కాంస్యం నెగ్గాడు. పురుషుల లాంగ్‌జంప్ టి47 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ స్వర్ణంతో మెరిశాడు.
అతను 7.11 మీటర్ల దూరం లంఘించి మొదటి స్థానంలో నిలవగా... ఖసనోవ్ (ఉజ్బెకిస్తాన్; 6.99 మీటర్లు), సఫ్రాన్ (శ్రీలంక; 6.55 మీటర్లు) రజత, కాంస్యాలు నెగ్గారు. మహిళల 1500 మీటర్ల టి12/టి20 ఈవెంట్‌లో భారత్ ఖాతాలోనే స్వర్ణ, రజతాలు చేరాయి. సౌమ్య (5 నిమిషాల 12.39 సెకన్లు) స్వర్ణం అందుకోగా, రాధ వెంకటేశ్ (5 నిమిషాల 30.90 సెకన్లు)కు రజతం లభించింది. మనా ససాకి (జపాన్; 5 నిమిషాల 12.15 సెకన్లు)కు కాంస్యం లభించింది.
మహిళల 1500 మీటర్ల టి11 ఈవెంట్‌లో భారత అథ్లెట్ రవన్ని వలసనైని కాంస్యం గెలుచుకుంది. ఆమె ఈ పరుగును 5 నిమిషాల 41.85 సెకన్లలో పూర్తి చేసింది. హి షన్‌షన్ (చైనా; 4 నిమిషాల 41.19 సెకన్లు) స్వర్ణం సాధించగా, జెంగ్‌లీ హువాంగ్ (చైనా; 4 నిమిషాల 55.54 సెకన్లు) రజతం అందుకుంది.
ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ రక్షిత రాజు ‘డిస్‌క్వాలిఫై’ అయింది. నిజానికి రక్షిత మూడో స్థానంతో ముగించి కాంస్యం నెగ్గింది. అయితే ఆసియా క్రీడల పోటీల్లో ధరించాల్సిన దుస్తులకు సంబంధించి నిబంధనలు సరిగా పాటించకుండా ఆమె ఉల్లంఘించింది. దాంతో నిర్వాహకులు డిస్‌క్వాలిఫై చేశారు. దాంతో నాలుగో స్థానంలో నిలిచిన రవన్నికి కాంస్యం దక్కింది.
జూడోలో రజత, కాంస్యాలు...
భారత్‌కు జూడో తొలి రోజు రెండు పతకాలు అందించింది. మహిళల జే12 52 కేజీల కేటగిరీలో భారత జూడోకా కోకిల రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో కోకిలపై ‘ఇపోన్’ స్కోరింగ్‌తో ఐబికె ఉలాన్‌బెక్ (కిర్గిస్తాన్) విజయం సాధించింది. పురుషుల జే1 79 కేజీల కేటగిరీలో కపిల్ పర్మార్ కాంస్య పతకం సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన బౌట్‌లో కపిల్ ‘ఇపోన్’ స్కోరింగ్‌తో రఫ్లీ షిద్‌ఖీ (ఇండోనేసియా)పై గెలుపొందాడు.
ఒకే ఈవెంట్‌లో స్వర్ణ, రజతాలు...
షూటింగ్‌లో కూడా తొలిరోజు భారత్ ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది. మహిళల ఆర్2–
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో మోనా అగర్వాల్ స్వర్ణం గెలుచుకోగా, అవని లేఖరా రజతం సాధించింది. గత ఆసియా క్రీడల్లో అవని స్వర్ణం గెలిచింది. మోనా 250 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టోక్యో, పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత అవని 249.6 పాయింట్లతో రజతానికి పరిమితమైంది. యూన్రీ లీ (దక్షిణ కొరియా; 227.9 పాయింట్లు)కు కాంస్య పతకం దక్కింది.
టీటీ, బ్యాడ్మింటన్‌లలో పతకాల ఖాయం...
పారా ఆసియా క్రీడల్లో రాణిస్తూ మన ప్లేయర్లు మరికొన్ని క్రీడాంశాల్లో పతకాలు ఖాయం చేశారు. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భవీనా పటేల్, ప్రాచీ పాండే, సోనల్‌బెన్ మూడు వేర్వేరు కేటగిరీల్లో సెమీఫైనల్‌కు చేరుకోవడంతో పతకాలు ఖాయమయ్యాయి. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ నితేశ్ కుమార్–
తులసిమతి మురుగేశన్ సెమీఫైనల్లో అడుగు పెట్టడంతో మరో పతకం ఖాయమైంది.
రవి కార్తీక్‌కు రజత పతకం
స్వల్పంగా దృష్టి లోపం ఉన్న స్విమ్మర్లు పారా స్విమ్మింగ్ ఎస్13 కేటగిరీలో పోటీ పడతారు. ఆసియా క్రీడల పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్13 ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుడిగిన రవి కార్తీక్ రజతం సొంతం చేసుకున్నాడు. 56.68 సెకన్లలో అతను రేస్‌ను పూర్తి చేశాడు. ఇగోర్ బొలొటొవ్ (ఉజ్బెకిస్తాన్; 52.90 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, విక్టర్ వొల్కొవ్ (కజకిస్తాన్; 57.23 సెకన్లు)కు కాంస్యం లభించింది.
ఎస్11, ఎస్12 కేటగిరీలతో పోలిస్తే తక్కువ అంధత్వం ఉన్న ప్లేయర్లు ఎస్13 కేటగిరీలోకి వస్తారు. స్విమ్మింగ్‌లో ఏదో ఒక ఈవెంట్‌కే పరిమితం కాకుండా ఫ్రీస్టయిల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్‌ఫ్లయ్, వ్యక్తిగత మెడ్లీలలో కూడా సత్తా చాటుతూ భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ పారా స్విమ్మర్లలో ఒకడిగా రవి కార్తీక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్‌లో ఆరు వేర్వేరు ఈవెంట్లలో కలిపి రవి 3 స్వర్ణాలు, 3 రజతాలు సాధించడం విశేషం. 2026 గ్లాస్గో కామన్వెల్త్ పారా గేమ్స్‌లో రవి పాల్గొన్నాడు.


