Photo Credit: Twitter
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఫ్రాంచైజీకి డైరక్టరేట్ ఆఫ్ క్రికెట్‌గా పురుషుల, మహిళల జట్టుకు సేవలందిస్తోన్న గంగూలీ.. ఇకపై జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే గంగూలీ ఐపీఎల్ కోచ్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి.
గతంలో ఢిల్లీ మెంటార్‌గా వ్యవహరించిన గంగూలీ, ఇప్పటివరకు ఐపీఎల్‌లో హెడ్‌కోచ్‌గా పనిచేయలేదు. కాగా తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ వచ్చే ఎడిషన్‌కు సపోర్ట్ స్టాఫ్‌ను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గంగూలీకి హెడ్ కోచ్ పదవిని అప్పగించిది.
త్వరలోనే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో యువీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తన అనుభవాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఉపయోగించనున్నారు. శ్రీలంక దిగ్గజ పేసర్ చమింద వాస్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచిన మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ పిచ్‌లు, కండిషన్స్‌పై ఆయనకు మెండుగా అనుభవం ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభ సీజన్ నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతూ వస్తోంది.2008 ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి 2018 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరుతో కొనసాగిన జట్టు.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు.
తొలి సీజన్‌లో సెమీస్ చేరిన ఢిల్లీ ఆ తర్వాత 2012లో ఒకసారి ప్లేఆఫ్స్ చేరింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మారిన తర్వాత 2019లో ప్లేఆఫ్స్, 2020లో రన్నరప్, 2021లో మరోసారి ప్లేఆఫ్ చేరినప్పటికీ టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. భారత క్రికెట్‌కు దశాబ్దాల పాటు సేవలందించిన ఈ దిగ్గజాల రాకతోనైనా ఢిల్లీ క్యాపిటల్స్ రాతను మారుస్తుందేమో చూడాలి.
Dilli, it's time for Dadagiri 🐅 Sourav Ganguly, Head Coach of the Tigers 🔥 https://t.co/EMTPQ9TB64
— Delhi Capitals (@DelhiCapitals) October 6, 2026
ఇదీ చదవండి: మెద్వెదెవ్‌పై అనర్హత వేటు.. ఫైనల్లో జొకోవిచ్


