
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.
ఇంగ్లండ్ మహిళా జట్టు (England Women vs India Women)తో రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. మొదటి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
150వ టీ20 మ్యాచ్
ఇక బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్‌పై.. భారత్ 24 రన్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది అంతర్జాతీయ స్థాయిలో 150వ టీ20.
రోహిత్, హర్మన్ సరసన
ఇప్పటి వరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. కాగా 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో కలిపి స్మృతి మంధాన 124కు పైగా స్ట్రైక్‌రేటుతో 3873 పరుగులు సాధించింది.
తద్వారా మహిళల టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది.
పురుషుల క్రికెట్‌లో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ఇక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్‌గానూ స్మృతి చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
రెండో టీ20లో విఫలం
ఇదిలా ఉంటే... తన 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో టీ20లో 13 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్టల్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 40 బంతుల్లోనే 63 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (13) రూపంలో కీలక వికెట్ తీసింది పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అమన్‌జోత్.
అగ్ర స్థానానికి చేరువైన స్మృతి
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సెంచరీతో విజృంభించిన స్మృతి... మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 771 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్‌ను అందుకుంది. మంధాన కెరీర్‌లో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.
హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన మంధాన... ఈ ఫార్మాట్‌లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తద్వారా మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టి20)లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న స్మృతి... టీ20ల్లో సైతం ఆ దిశగా ఆడుగులు వేస్తోంది.
టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ (12వ ర్యాంక్), షఫాలీ వర్మ (13వ ర్యాంక్), జెమీమా రోడ్రిగ్స్ (15వ ర్యాంక్) టాప్–20లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (735 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉండగా... రేణుక సింగ్ (721 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు