
కిర్మాణీ ఆటోబయోగ్రఫీని ఆవిష్కరించిన సిరాజ్
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ జీవిత కథ ‘స్టంప్డ్’ను భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ ‘1983లో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో నేనింకా పుట్టనే లేదు. మీ వికెట్ కీపింగ్ అద్భుతంగా ఉండేదని ఎంతో మంది చెప్పేవారు. మీ ప్రదర్శన ఎందరికో స్ఫూర్తిదాయకం’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.
కిర్మాణీ మాట్లాడుతూ... ‘నాకు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. నా విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. అలాంటి ప్రదేశంలో పుస్తకావిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. ఇందులో అప్పటి క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఉన్నాయి’ అని అన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అది్వతీయ ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌పై కిర్మాణీ ప్రశంసలు కురిపించారు.
ఇంగ్లండ్ టూర్‌లో సిరాజ్ దమ్ముచూపాడని ... తొలి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు ఒకే తీవ్రత కొనసాగించాడని కొనియాడారు. కిర్మాణీ అసలు సిసలు జెంటిల్‌మెన్ అని 1983 వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్‌నాథ్ ప్రశంసించగా... అతడు జట్టు మనిషి అని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
టీమిండియా మాజీ సారథి అజహరుద్దీన్ మాట్లాడుతూ... ‘కిర్మాణీ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఆయన నడవడిక యువతరానికి స్ఫూర్తిదాయకం’ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. క్రీడా పాలసీతో తెలంగాణ ఆటల దశ మారనుందని పేర్కొన్నారు.