విజయనగరం ఐసిస్‌ కేసులో కదలిక | NIA searches in 16 areas in several states including Telangana | Sakshi
Sakshi News home page

విజయనగరం ఐసిస్‌ కేసులో కదలిక

Sep 17 2025 4:59 AM | Updated on Sep 17 2025 4:59 AM

NIA searches in 16 areas in several states including Telangana

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు  

సాక్షి హైదరాబాద్‌/కొత్తగూడెం టౌన్‌: ఐఈడీ (ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌)ల ద్వారా విధ్వంసాలకు పాల్పడడానికి కుట్రపన్నిన విజయనగరం ఐసిస్‌ కేసులో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని 16 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్‌ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయనగరం కేంద్రంగా ఐసిస్‌ ఉగ్రవాది సిరాజ్‌–ఉర్‌–రెహమాన్‌ను జులైలో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. 

ఐఈడీల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను సిరాజ్‌ కలిగి ఉండటంతో ఉగ్రవాద నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ స్పెషల్‌ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 27న సౌదీ అరేబియాలోని రియాద్‌కు పారిపోవడానికి ప్రయత్నించిన ఆరిఫ్‌ హుస్సేన్‌ అలియాస్‌ అబూ తాలిబ్‌ను అరెస్ట్‌ చేసింది. సిరాజ్‌తో కలిసి నేపాల్‌ సరిహద్దు ద్వారా ఆయుధాల సరఫరాకు ఏర్పాట్లు చేయడానికి కుట్ర చేసినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినట్లు సిరాజ్‌ విచారణలో వెల్లడించాడు. దీని ఫలితంగా మరో నిందితుడు సయ్యద్‌ సమీర్‌ను కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. 

ఈ సోదాల్లో డిజిటల్‌ వివైజులు, డాక్యుమెంట్లు, నగదు సహా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉగ్రవాదం వైపు యువత రిక్రూట్‌మెంటుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఐదు నెలల క్రితం పెట్టిన మతపరమైన పోస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు లైక్‌ కొట్టిన నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. 

కొత్తగూడెం బస్టాండ్‌ సమీపాన మధురబస్తీలోని ఓ ఇంటికి తెల్లవారుజామున 4 గంటలకు దాదాపు పది వాహనాలతో వచ్చిన అధికారులు ఉదయం 6 గంటల వరకు సోదాలు నిర్వహించి వివరాలు సేకరించారు. అనంతరం కొత్తగూడెం పాలకేంద్రం సమీపాన మరొకరి ఇంట్లోనూ చేపట్టిన తనిఖీలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement