
మహిళల్లో పెగూలా, అండ్రీవా కూడా
సత్తాచాటుకున్న బోపన్న జోడీ
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్టార్లు, సీడెడ్ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లొస్ అల్‌కరాజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కొకొ గాఫ్, మూడో సీడ్ పెగూలా, ఆరో సీడ్ అండ్రీవా ప్రిక్వార్టర్స్ చేరారు. అయితే భారత డబుల్స్ ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న తన చెక్ రిపబ్లిక్ భాగస్వామితో ముందంజ వేయగా... శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లోనే చుక్కెదురైంది.
సులువుగా సినెర్...
టాప్‌సీడ్ ఇటలీ స్టార్ యానిక్ సినెర్ క్లేకోర్ట్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో మూడు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్, నిరుటి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సినెర్ 6–0, 6–1, 6–2తో చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి లెహెకాపై అలవోక విజయం సాధించాడు. గంటన్నర పాటు జరిగిన ఈ సమరంలో 3 ఏస్‌లు సంధించిన టాప్‌సీడ్ ఆటగాడు, 27 విన్నర్లు కొట్టాడు.
లెహెక మూడు ఏస్‌లు సంధించినప్పటికీ 14 విన్నర్లే కొట్టగలిగాడు. గత ఫ్రెంచ్ ఓపెన్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 7–6 (7/4), 6–1తో ఇటలీకి చెందిన ఫ్లావికొ కొబొలిపై గెలుపొందగా... స్పెయిన్ సంచలనం, రెండో సీడ్ అల్‌కరాజ్ 6–1, 6–3, 4–6, 6–4తో డమిర్ డిజుమ్‌హుర్ (బోస్నియా)పై విజయం సాధించాడు.
పెగూలా జోరు
మహిళల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో జెస్సికా పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–2తో మార్కెటా వొండ్రుసొవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందగా... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) 6–1, 7–6 (7/3)తో బొజ్కొవా (చెక్ రిపబ్లిక్)తో విజయం సాధించింది. ఆరో సీడ్ అండ్రీవా (రష్యా) 6–3, 6–1తో యూలియా పుతిత్సెవా (కజకిస్తాన్)పై సులువుగా గెలిచి ప్రిక్వార్టర్స్ చేరారు. అమెరికన్ ప్రత్యర్థుల మధ్య జరిగిన మరో పోరులో ఏడో సీడ్ మాడిసన్ కీస్ 4–6, 6–3, 7–5తో 31వ సీడ్ కెనిన్‌పై నెగ్గింది.
డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న
భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన రెండో రౌండ్లో బోపన్న–పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడీ 6–7 (2/7), 7–6 (7/5), 6–2తో ఫ్రాన్స్‌కు చెందిన 13వ సీడ్ సాడియో డౌంబియా– ఫెబియెన్ రి»ొల్ జంటపై చెమటోడ్చి నెగ్గింది. ఇరు జోడీలు హోరాహోరీగా తలపడటంతో తొలి రెండు సెట్లు టైబ్రేక్‌కు దారితీసాయి.
తొలిసెట్ కోల్పోయినప్పటికీ ఎలాంటి నిరుత్సాహానికి గురవని భారత్–చెక్ జోడీ రెండో సెట్‌లో పుంజుకొంది. టైబ్రేక్‌తో రెండో సెట్‌ను తర్వాత మూడో సెట్‌తో మ్యాచ్‌లో గెలుపొందింది. మరో డబుల్స్ ద్వయం శ్రీరామ్ బాలాజీకి రెండో రౌండ్లో చుక్కెదురైంది. బాలాజీ–రెయెస్ వారెలా (మెక్సికో) 3–6, 4–6తో ఇటలీకి చెందిన సిమోన్ బొలెలి– అండ్రియా వవసొరి జంట చేతిలో ఓటమి పాలైంది.