ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు నేడు జరిగే తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన వైవోన్ లీతో తలపడనుంది. ముందుగా విడుదల చేసిన ‘డ్రా’ ప్రకారం తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడాల్సింది. అయితే చివరి నిమిషంలో ‘డ్రా’లో మార్పులు జరిగాయి. సవరించిన ‘డ్రా’ ప్రకారం సింధు, ఆన్ సె యంగ్ క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంది.
సింధు తొలి రౌండ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో నత్సుకి నిదియారా (జపాన్), తన్వీ శర్మ (భారత్) మధ్య మ్యాచ్ విజేతతో తలపడుతుంది. సింధు, తన్వీ శర్మలతోపాటు మహిళల సింగిల్స్‌లో దేవిక సిహాగ్, ఉన్నతి హుడా, అష్మిత చాలిహా ఈ టోర్నీ బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, ఆయుశ్ శెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... రితూపర్ణ–శ్వేతాపర్ణ పాండా జోడీలు పోటీపడతాయి.


