ప్రిక్వార్టర్స్‌లో సింధు  | Sindhu in prequarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సింధు 

Published Wed, Oct 18 2023 2:12 AM | Last Updated on Wed, Oct 18 2023 2:12 AM

Sindhu  in prequarters - Sakshi

ఒడెన్స్‌: బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌ 750 టోర్నీ డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రత్యర్థినుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా చివరకు తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21–14, 18–21, 21–10 స్కోరుతో కిర్‌స్టీ గిల్మర్‌ (స్కాట్లండ్‌)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న తర్వాత సింధుకు ఆ తర్వాత గిల్మర్‌ గట్టి పోటీనిచ్చి పోరును 1–1తో సమం చేసింది.

అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు తన స్థాయికి తగినట్లుగా చెలరేగింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి దూసుకుపోయిన భారత షట్లర్‌ చివరి వరకు దానిని కొనసాగించింది. మహిళల సింగిల్స్‌లో మరో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్‌ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో ఆకర్షి 10–21, 22–20, 21–12 తేడాతో లి వైవోన్‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను నిరాశ ఎదురైంది.

తొలి పోరులో శ్రీకాంత్‌ 21–19, 10–21, 16–21తో వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ (చైనా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. లక్ష్య సేన్‌ కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. థాయిలాండ్‌కు చెందిన కంటఫాన్‌ వాంగ్‌ చరన్‌ 21–16, 21–18తో లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు.   మరో వైపు ఆసియా క్రీడల స్వర్ణపతక జోడి సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి చివరి నిమిషంలో టోర్నీనుంచి నిష్క్రమించింది. ఈ జంట వాకోవర్‌ ఇవ్వడంతో మలేసియా ద్వయం ఆంగ్‌ యు సిన్‌ – టియో యీ యి రెండో రౌండ్‌కు చేరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement