
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆఖరి వరకు పోరాడి ఓటమి పాలైంది. లక్ష్య చేధనలో 170 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(181 బంతుల్లో 61) విరోచిత పోరాటం చేశాడు.
టాపర్డర్ విఫలం కావడంతో భారత్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. శుబ్‌మన్ గిల్(6), యశస్వి జైశ్వాల్(0), కరుణ్ నాయర్(14) తీవ్ర నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేన పతనాన్ని శాసించారు.
వీరిద్దరితో పాటు కార్స్ రెండు, బషీర్, వోక్స్ తలా వికెట్ సాధించారు. ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ఆఖరి వరకు పోరాడిన తమ ఆటగాళ్లను గిల్ అభినందించాడు.
"ఈ మ్యాచ్‌లో ఓడినా.. చాలా గర్వంగా ఉంది. మేము గెలుపు కోసం చివరి సెషన్, చివరి వికెట్ వరకు ప్రయత్నించాము. కానీ దురదృష్టవశాత్తూ మేము లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. అయితే చేతిలో చాలా వికెట్ల ఉండడంతో టార్గెట్‌ను ఈజీగా చేజ్ చేస్తామని భావించాను. కానీ ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం మాపై పైచేయి సాధిస్తూ వచ్చారు.
దీంతో టాపర్డర్‌లో 50 పరుగుల భాగస్వామ్యాలు ఒకట్రెండు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాము. కానీ మేము అలా చేయలేకపోవడంతోనే ఓటమి చవిచూశాము. వారు మా కంటే బాగా ఆడారు. అయితే జడేజా క్రీజులో ఉండడంతో మేము గెలుస్తామన్న నమ్మకం నాకు ఉండేది. అతడి చాలా అనుభవం ఉంది.
అందుకే అతడికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. టెయిలాండర్లతో కలిసి అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మా టెయిలాండర్లు(బుమ్రా, సిరాజ్) సైతం అతడికి సహకరించారు. కానీ ఆఖరికి మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయాము. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ ఆటను మలుపు తిప్పింది.
ఒకానొక సమయంలో మొదటి ఇన్నింగ్స్‌లో మాకు 50 నుంచి 60 పరుగుల ఆధిక్యం లభిస్తుందని మేము అనుకున్నాము. కానీ పంత్ ఔట్ కావడంతో అంతా తారుమారైంది. ఈ పిచ్‌లో 150-200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని మాకు తెలుసు. అందుకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం పొందాలని భావించాము.
కానీ మేము అనుకున్నది జరగలేదు. పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి. నాలుగో రోజు ఆటలో చివరి సెషన్‌లో మేము కొంచెం మెరుగ్గా ఆడి వికెట్లు కోల్పోకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ సరైన ప్రణాళికలతో బరిలోకి దిగింది.
చివరి రోజు మాకు ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి ఉన్నా గెలిచే వాళ్లం. మిగిలిన మ్యాచ్‌లలో మా తప్పిదాలను సరిదిద్దుకుంటాము. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటుపై త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని" గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.